సాగునీటి ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం

-పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తెలంగాణకు ప్రత్యేక జల విధానం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతి, టెండర్ల పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. గురువారం ఆయన రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులతో చర్చించారు.

KCR

పాలమూరుతోపాటు డిండి ఎత్తిపోతల పథకం పురోగతిపై కూడా సీఎం కేసీఆర్ ఆరా తీశారని తెలుస్తున్నది. నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్ల విధానంలో సమూల మార్పులు తెచ్చి సరికొత్త టెండర్ల నమూనాను అధికారులు రూపొందించారు. ఈ నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఎప్పటిలోగా టెండర్లు పిలుస్తారన్న సమాచారం సీఎం అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఆ తర్వాత రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రాజెక్టులు సకాలంలో నిర్దేశిత సమయానికి పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా అవి వినియోగంలోకి వచ్చేనాటికి ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చూడాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని సమాచారం.