ప్రతిపక్షాలది విషప్రచారం

-హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా తెలంగాణ బిడ్డలే
-అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాం
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
-టీఆర్‌ఎస్‌లో చేరిన శేరిలింగంపల్లి
టీడీపీ ఇన్‌చార్జి మొవ్వా సత్యనారాయణ

KTR invites sherlingampally TDP incharge in to TRS Party
స్వరాష్ట్ర ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌లో ప్రాంతేతరులకు స్థానం ఉండదని, శాంతిభద్రతల సమస్య వస్తదని, సీమాంధ్రుల్ని తరిమేస్తరని కొందరు రాజకీయ నాయకులు విష ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడిన 15 నెలల్లో ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిందా? అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు వాక్‌శుద్ధి కంటే చిత్తశుద్ధి ముఖ్యమని సూచించారు. కేసీఆర్ రాజనీతిజ్ఞుడని, హైదరాబాద్‌లో ఉండేవారంతా తెలంగాణ బిడ్డలేనని, శాంతిభద్రతల సమస్య ఉండదని ఎన్నికల ప్రచారంలోనే చెప్పారన్నారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అన్నదమ్ముల్లా విడిపోయినా ప్రజలుగా కలిసుందామని, భవిష్యత్తులోనూ అందరం ఇదే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మొవ్వా సత్యనారాయణ, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అయ్యప్ప సొసైటీ ఆక్రమణలను కూల్చివేస్తే కొన్ని పార్టీలు గగ్గోలు పెట్టాయని, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఇండ్లను కూల్చివేస్తున్నారంటూ ప్రభుత్వంపై చిల్లర ప్రచారానికి దిగాయని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా వెలిసిన ఆక్రమణలు, విచ్చలవిడితనంతో వెలిసిన కట్టడాలపై చర్యలు తీసుకోవాలని భావించి అక్కడ కూల్చివేతలు జరిపామని, ఇందులో రెండు రాష్ర్టాలకు సంబంధించిన వాళ్లు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఓట్లు తొలగిస్తున్నారని విషప్రచారం చేశారని, దీనిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను వివరాలు అడిగితే ఆశ్చర్యం కలిగే వాస్తవాలు తెలిశాయని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 67 లక్షల జనాభా ఉంటే 72 లక్షల ఓట్లు ఉంటాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత ఏపీ ప్రజలంతా కేసీఆర్ ఫొటో పెట్టుకుని మొక్కుతున్నారని, కృష్ణా, గుంటూరుకు చెందినవారంతా భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో రెండు రాష్ర్టాలు నంబర్ 1, 2లుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

అంబానీ సోదరులుగా రెండు రాష్ర్టాలు గణనీయమైన అభివృద్ధిగాంచాలని, ముకేశ్ అంబానీలా తెలంగాణ రాష్ట్రం ముందుండాలని కేటీఆర్ అన్నారు. హైటెక్కులంటూ హైదరాబాద్‌కు అది చేశాం..ఇది చేశామని చెప్పుకొనేటోళ్లు వర్షపు నీరు, ట్రాఫిక్ చూస్తే వారేం చేశారో తెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం అందకారమవుతుందని పటంలో కర్ర పట్టుకుని చెప్పిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ జీవితమే అంధకారమైందని, మన రాష్ట్రం దేదీప్యమానంగా నిరంతర విద్యుత్‌తో వెలుగుతున్నదన్నారు. సంవత్సరం తిరక్కుండానే కోతల్లేని కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రూపాయికే కిలో బియ్యం వంటి పథకాలతోపాటు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా లక్ష మందికి పట్టాలిచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.