ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తించండి

రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలుకు సహకరించాలని బ్యాంకర్లను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. లబ్ధిదారులు, బ్యాంకర్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి పరస్పరం సహకరించుకోవాలన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సాంతను ముఖర్జీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్బీసీ)లో మంత్రి ఈటెల ఎస్‌ఎల్బీసీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిర్ణీత కాలంలో కార్యరూపం దాల్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు.

Etela-Rajendar-Meeting-with-Bankers

-లబ్ధిదారులకు అండగా నిలవండి
-లక్ష్యాల సాధనలో సర్కార్‌కు సహకరించండి
-ఎస్‌ఎల్బీసీ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల
ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాలు పూర్తిచేయడంతోపాటు వచ్చే (2015-16) సంవత్సరానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపికలో ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నదన్నారు. కనుక బ్యాంకులు సకాలంలో లబ్ధిదారులకు రుణాల మంజూరులో సహకరించాలని చెప్పారు. పథకాల అమలుపై బ్యాంకర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తే.. లోపాలు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఈటెల తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ పంట రుణాల మంజూరులో ఎంతగానో సహకరించిన బ్యాంకర్లు పంట రుణాల రెన్యూవల్స్ పూర్తి చేయాలని కోరారు. ఎస్‌బీహెచ్ ఎండీ సాంతనుముఖర్జీ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, కాకతీయ మిషన్ తదితర పథకాలు బహుళ ప్రయోజనకారిగా ఉన్నాయని ప్రశంసించారు. కేంద్రప్రభుత్వం.. దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)గా గుర్తించిందన్నారు. రాష్ట్రంలోని పదిజిల్లాల పరిధిలో పనిచేసే బ్యాంక్ లోగోను ఈ నెల 12న ఆవిష్కరించామని సాంతనుముఖర్జీ చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల చెందిన 4682 శాఖల్లో గత సెప్టెంబర్ నాటికి రూ.296.422 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. రూ.334.957 కోట్ల అడ్వాన్సు చెల్లింపులతో ముందంజలో ఉన్నాయని ఆయన వివరించారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ బ్యాంకర్లు పంటరుణాల రెన్యూవల్‌కు వెసులుబాటు కల్పించాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ సీతాపతిశర్మ, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు, ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ జీ జే రాజు, నాబార్డు జనరల్ మేనేజర్ కిషన్‌సింగ్ పాల్గొన్నారు.