త్వరలో లక్ష ఉద్యోగాలు

ఉద్యోగుల కొరత ఉన్నది. భర్తీ తక్షణ అవసరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి కావస్తున్నది. కమల్‌నాథన్ కమిటీ నివేదిక రాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అని భారీ నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టీఎన్జీవో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పరిధిలోని కొన్ని శాఖలను విస్తృత పరచాల్సి ఉందని, ఉద్యోగాల భర్తీ అత్యవసరమని చెప్పారు. జీతాలు కాదు.. జీవితాలు ముఖ్యమని, రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు.

– కమల్‌నాథన్ కమిటీ నివేదిక రాగానే భర్తీకి శ్రీకారం
– మనది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఇబ్బందులుండవు
– దేవీప్రసాద్‌కు సర్కారులో సమున్నత స్థానం కల్పిస్తాం
– ఆశిస్తున్నట్లే పీఆర్సీ: భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

harishrao-13-12-14ఇప్పటికే తెలంగాణ ఇంక్రిమెంట్, షరతులు లేకుండా హెల్త్‌కార్డులు అందించారని గర్తుచేశారు. ఉద్యోగులు కోరుకుంటున్నట్లుగా ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రభుత్వం అమలుచేస్తుందని హామీ ఇచ్చారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీల పాత్ర పోషించిన టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు ప్రభుత్వంలో సమున్నత స్థానం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టడానికి రెండు రోజుల ముందు ప్రస్తుత కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, దేవీప్రసాద్‌ల సమక్షంలో గంటల తరబడి చర్చలు జరిపామని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్‌తో సన్నిహింతంగా ఉన్నవారిలో స్వామిగౌడ్‌కు కౌన్సిల్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించామని, దేవీప్రసాద్‌ను గౌరవించుకోవాల్సి ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి కోరినా పదవులు వద్దని, ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని చెప్పిన గొప్పవ్యక్తి దేవీప్రసాద్ అని కొనియాడారు.

పునర్నిర్మాణంలో అదే స్ఫూర్తి ప్రదర్శించాలి: తెలంగాణ సాధనలో చూపించిన తెగువ, స్ఫూర్తిని పునర్నిర్మాణంలో ప్రదర్శించాలని ఉద్యోగులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలు ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారని, సంక్షేమ పథకాలను ఉద్యోగులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులుండవని హామీఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం చెప్పిన మాటలను పునరుద్ఘాటించారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై పూర్తి నమ్మకం ఉన్నదని, అన్ని పథకాల అమలు బాధ్యతను వారికే అప్పగిస్తున్నదన్నారు.

పక్క రాష్ట్రమైన ఏపీలో రేషన్‌కార్డుల అర్హుల ఎంపిక బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించడాన్ని విమర్శిస్తూ పైవిధంగా స్పందించారు. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సర్వే తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నారంటే ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఒకరోజు చెరువుల పునరుద్ధరణలో శ్రమదానం చేస్తామని ప్రకటించిన దేవీప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ రాములునాయక్, కలెక్టర్ రాహూల్‌బొజ్జా, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి శ్యాంరావ్, రేచల్, విజయ పాల్గొన్నారు.

మిషన్ కాకతీయలో ఒకరోజు శ్రమదానం: దేవీప్రసాద్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో సామాజిక బాధ్యతగా ఉద్యోగులమంతా ఒకరోజు శ్రమదానం చేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటించారు. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్య ప్రభుత్వాలు చెరువులను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విజయవంతానికి ఉద్యోగులు శక్తివంచన లేకుండా కృషిచేస్తారని హామీఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. 28 రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా హెల్త్‌కార్డుల పథకం అమలుచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎలాంటి పరిమితి విధించకుండా కార్డులు ఇవ్వడంపై సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం గౌరవప్రదమైన పీఆర్సీ ఇస్తుందని విశ్వాసం ఉన్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆర్నెళ్ల వ్యవధిలోనే ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు.