గడువులోగా ప్రాజెక్టులు పూర్తి

-లక్ష్యాలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలి
-అలసత్వం ప్రదర్శించిన గామన్ ఇండియాపై చర్యలు
-మహబూబ్‌నగర్ జిల్లా వీడియో కాన్ఫరెన్సులో మంత్రి హరీశ్‌రావు

సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులపై మంత్రి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

Harish-Rao-in-Video-conference-on-pending-projects

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై చర్చను ప్రారంభిస్తూ, ఈ ప్రాజెక్టు కింద ఈ ఖరీఫ్ నాటికి లక్షా ఇరవై వేల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పంపుహౌజ్ నిర్మాణం, భూసేకరణ అంశాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భూసేకరణకు అవసరమైన రూ. 9 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలను పంపాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు మూడోదశ పంపుహౌజ్ నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టు కంపెనీ గామన్ ఇండియాపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో ఈ ఏడాది 68 వేల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులో మూడు రైల్వే క్రాసింగ్‌లు పూర్తికాకపోతే 15 వేల ఎకరాలకు నీరివ్వడం సాధ్యపడదని, అందువల్ల రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అలాగే కోయల్‌సాగర్‌లో 22 వేల ఎకరాలకు, భీమాలో ఆరు వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం నిర్వాసితుల ఉద్యోగ, ఉపాధి కల్పనపై కలెక్టర్ నుంచి వివరణ అడిగి తెలుసుకున్నారు.

జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి కూడా జిల్లాలో ఇదొక ప్రధాన సమస్యగా పరిణమించిందని, గతంలో కర్నూలు వాసులకు ఇచ్చిన విధంగా మహబూబ్‌నగర్ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జిల్లాలో మిషన్ కాకతీయ పనులు కూడా శరవేగంగా జరగాలని మంత్రి సూచించారు. పూడిక మట్టిని మొదట రైతులకు, ఆ తర్వాత పాత బావులు పూడ్చడానికి, ఆపైన ఇటుక భట్టీల వారికి ఇవ్వాలని మంత్రి సూచించారు.