భారీగా నిధులు రాబట్టాలి

-ప్రభుత్వ పథకాలపై ఆర్థిక సంఘాన్ని ఒప్పించాలి..
-వినూత్న పథకాల ప్రయోజనాలు అర్థమయ్యేలా వివరించాలి
-ఉన్నతాధికారులతో సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశం
-నేడు రాష్ర్టానికి ఆర్థిక సంఘం.. రేపు గ్రాండ్ కాకతీయలో సమావేశం

KCR Review with Finance department

కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా రూపొందిస్తున్న విధానాలు, ప్రణాళికల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు పక్కా వ్యూహాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

14వ ఆర్థిక సంఘం సభ్యులు గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వారి ముందుంచాల్సిన ప్రతిపాదనలపై బుధవారం సీఎం కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు, వాటికి ఎలాంటి విధానాలు రూపొందిస్తున్నామనే విషయాలను ఆర్థిక సంఘానికి స్పష్టంగా చెప్పాలని సీఎం సూచించారు. మన ఊరు మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ, గిరిజన సంక్షేమం, తాగునీటి గ్రిడ్, హరిత హారంలాంటి వినూత్న కార్యక్రమాలు వాటి ప్రయోజనాలను వివరించి సహకారం కోరాలని ఆదేశించారు.

మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమంతో వ్యక్తులకు, గ్రామాలకు ఏం కావాలో స్పష్టత వచ్చిందని, వాటికి అనుగుణంగా రూపొందిస్తున్న ప్రణాళికలకు నిధులు అడుగనున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వాలు నీరు-మీరు లాంటి నిరుపయోగ కార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చించినా సత్ఫలితాలు రాలేదని, తమ ప్రభుత్వం మాత్రం చెరువులు పునరుద్ధరించటంతో పాటు హరితహారం లాంటి కార్యక్రమాలతో వాతావరణ సమతుల్యం కాపాడి భూగర్భ జలాలు పెంచుతున్నట్లు ఆర్థిక సంఘానికి వివరించాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్‌కు కృష్ణా నీటిని తరలించటానికి కూడా ప్రణాళిక సిద్ధంగా ఉందని, రాష్ర్టానికి అత్యవసరమైన పాలమూరు, పాకాల-జూరాల ప్రాజెక్టు లాభాలను సరిగ్గా వివరిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి, చొరవను అర్థం చేసుకుంటారని సీఎం అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి పథకాలకు ప్రాధాన్యం లభిస్తున్నదని, కేంద్రం కూడా మంచినీటి అవసరాలు తీర్చే విధానాలకు మద్దతుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రూ.25వేల కోట్లతో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్, పోలీస్ వ్యవస్థ బలోపేతం కోసం సింగపూర్ తరహాలో నైబర్‌హుడ్ పోలీసింగ్ విధానం రూపొందిస్తున్న విషయాలను ఆర్థిక సంఘానికి వివరించాలని సూచించారు. హైదరాబాద్‌లో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టే రోడ్ల నిర్మాణం, అడవుల రక్షణలాంటి పథకాలను వివరించాలని ఆదేశించారు.

సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, జీఆర్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, వివిధ శాఖల కార్యదర్శులు బీపీ ఆచార్య, నాగిరెడ్డి, రాధ, జోషి, రేమండ్ పీటర్, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలు, ప్రతిపాదనలపై చర్చించేందుకు వైవీ రెడ్డి అధ్యక్షతనగల 14వ ఆర్థిక సంఘం గురువారం హైదరాబాద్‌కు రానుంది.

13మంది సభ్యులుగల ఈ సంఘం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రాండ్ కాకతీయ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. ఈ సంఘానికి సమర్పించాల్సిన వివిధ శాఖలకు చెందిన నివేదికలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. సమావేశం అనంతరం ఆర్థిక సంఘం సభ్యులకు ఫలక్‌నూమాలో కానీ, చౌమహల్లా ప్యాలెస్ కానీ ప్రభుత్వం విందు ఏర్పాటు చేయనుంది. ఈ విందుకు ముఖమంత్రి కూడా హాజరవుతారు. హైదరాబాద్ రానున్న ఆర్థిక సంఘంలో ప్రొఫెసర్ అభిజిత్‌సేన్, సుష్మానాథ్, ఎం గోవిందరావు, సుదీప్తో ముండే, ఏఎన్ జా, సెంథిల్, బాటియా తదితరులు సభ్యులుగా ఉన్నారు.