Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రాష్ర్టానికి కేంద్రం నిధులు పెంచాలి

-కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో మంత్రి ఈటల భేటీ -రుణపరిమితి పెంపు, పన్ను బకాయిలు, గ్రాంట్లు, రాయితీల విడుదలకు విజ్ఞప్తి -వెనుకబడిన ప్రాంతాలకు 700 కోట్లు త్వరలో విడుదల.. జైట్లీ హామీ -నగర సంస్థలకు ఆదాయం పన్ను రాయితీ కల్పించాలని ఈటల సూచన -ఏడు అంశాలతో కూడిన మెమొరాండం సమర్పణ -సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి

Etela-Rajendar

రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలు, గ్రాంట్లు, రాయితీలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని, ద్రవ్యసంస్థల రుణపరిమితిని పెంచాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో జైట్లీని కలుసుకుని హైదరాబాద్ నగర ప్రజలకు వివిధరకాల సేవలందిస్తున్న వాటర్‌బోర్డు వంటి సంస్థలకు ఆదాయం పన్ను రాయితీ కల్పించాలని కోరారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులపై మొత్తం ఏడు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కూడా ఈటల ఆయనకు సమర్పించారు. ఇందులోని అంశాలపై అరుణ్‌జైట్లీ సానుకూలంగా స్పందించారు. రుణపరిమితి పెంపుపై త్వరలో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ర్టాలు వివిధ ద్రవ్యసంస్థల నుంచి రుణాన్ని పొందడానికి ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టంకింద పరిమితిని పెంచే విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సానుకూలత వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత దీనిపై అనుమతులు జారీ అవుతాయని తెలిపారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అందించే రూ.700 కోట్ల ఆర్థికసాయం సైతం త్వరలోనే విడుదల కానున్నట్టు జైట్లీ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన ఏడు అంశాలతో కూడిన మెమొరాండంను ఈటల ఆయనకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్లను విడుదల చేయాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి సవరించిన ప్రతిపాదనలను గత సంవత్సరం మే నెలలోనే సమర్పించామని ఈటల తెలిపారు.

కేంద్రం నుంచి ఆర్థికసాయం అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రస్తుతం అమలుచేస్తూ ఉన్నదని వివరించారు. తెలంగాణకు కేంద్రం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) అందాల్సిన కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) బకాయిల్లో మూడోవంతు మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందని, కానీ ఇంకా విడుదల కాలేదని తెలిపారు. వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు 2014-15 సంవత్సరానికి బేసిక్ గ్రాంట్స్ విడుదల కావాల్సి ఉందని, అన్ని రాష్ర్టాలకు విడుదలైనా తెలంగాణ విషయంలో మాత్రం కేంద్రం తాత్సారం చేస్తున్నదని అన్నారు. గ్రాంట్స్ వెంటనే విడుదల చేయాలని అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు. పర్‌ఫార్మెన్స్ గ్రాంట్స్‌ను మాత్రం విడుదల చేసి బేసిక్ గ్రాంట్లను విడుదల చేయలేదని, వాస్తవానికి 13వ ఆర్థికసంఘం సిఫారసుల మేరకు ఈ నిధుల్ని విడుదల చేయడంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకపోయినా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 778.73 కోట్లమేరకు నిధులు రావాల్సి ఉన్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి, పారిశ్రామిక రంగాన్ని వృద్ధి చేయడానికి కేంద్రంనుంచి ప్రత్యేక పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు రావాల్సి ఉన్నదని, రానున్న 2016-17 బడ్జెట్‌లో వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మూడు అంశాల్లో అర్హత సాధించినట్లయితే ఆ రాష్ర్టాల జీడీపీల్లో 3.5% మేరకు రుణాన్ని పొందే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఆ మూడు అంశాల్లో అర్హత పొందినందువల్ల ప్రస్తుతం అమలవుతున్న 3.0% పరిమితిని 3.5%కి పెంచాలని అరుణ్‌జైట్లీని కోరారు.

ఇప్పటికే ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తాను కూడా లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశానని, కానీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదని వివరించారు. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందడం మాత్రమే కాకుండా 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల్లోని అన్ని అర్హతలలోనూ తెలంగాణ అర్హత సాధించిందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)తోపాటు రానున్న ఆర్థిక సంవత్సరానికి సైతం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.5%కి పెంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర రుణ పరిమితిని జనాభా ప్రాతిపదికన విభజించడం ద్వారా తెలంగాణకు రూ.900 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అందువల్ల ఆ నష్టాన్ని పూడ్చడానికి రానున్న బడ్జెట్‌లో ఈ డబ్బును చేర్చాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డు తదితర సంస్థలను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. అనంతరం ఈ అంశాలపై కేంద్రమంత్రి స్పందించిన తీరును ఈటల రాజేందర్ మీడియాకు వివరిస్తూ, ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పెంపుపై నీతిఆయోగ్ సిఫారసు అందినట్లు తెలిపారని, తదుపరి జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్న వెంటనే తప్పకుండా ఉత్తర్వులు జారీ అవుతాయని హామీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి అందాల్సిన రూ. 700 కోట్ల నిధులను కూడా త్వరలోనే ఒకే విడతగా విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారని తెలిపారు. సీఎస్టీ బకాయిల చెల్లింపు అంశంలో కూడా గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారని అన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్‌తో పాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బీ వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ కూడా పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక కార్యదర్శి రతన్ వాటాల్ ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రమంత్రికి వివరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.