Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ప్రాజెక్టులపై జాప్యం వద్దు..

-కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -నాలుగు ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వైలో చేర్చాలి -కేంద్ర జల సంఘం పనితీరు మారాలి -పర్యావరణ అనుమతులకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి -జల్‌మంథన్‌లో మంత్రి హరీశ్‌రావు సూచనలు -సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఉమాభారతి

Harish Rao with Umabharthi

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి జాతీ య హోదా కలిగిన ఒక ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ చేసి చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం చేయరాదని, పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేయాలని, జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని మం త్రి కోరారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జల్‌మంథన్-2 వర్క్‌షాప్‌లో హరీశ్‌రావు తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. వీటికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుపుతూ, ఇరవై రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వర్క్‌షాప్‌లో రాష్ట్రమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ర్టాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం (పీఎంకేఎస్‌వై)లో 46 ఏఐబీపీ ప్రాజెక్టులను ఎంపిక చేయగా తెలంగాణకు చెందినది ఒక్కటి మాత్రమే ఉన్నదని, మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చాలని కోరారు. వివిధ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను వేగిరపరుచాలని చెప్పారు. కేంద్ర జలసంఘం దగ్గర అనేక అంశాలు ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, నిర్దిష్ట కాలపరిమితిలోగా అనుమతులు మంజూరు కావడానికి తగిన విధానాన్ని రూపొందించాలని సూచించారు.

పీఎంకేఎస్‌వై పథకంలోకి చేర్చిన 46 ప్రాజెక్టులు ఆశించిన విధంగా నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తికావాలంటే కేంద్రం ఇవ్వాల్సిన పూర్తిస్థాయి నిధులను వెంటనే చెల్లించాలని, అప్పుడే ఈ లక్ష్యం నెరవేరుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకం కింద రూపొందించిన మార్గదర్శకాల్లో రాష్ర్టాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని సవరణలను చేయాలని చెప్పారు. ఉదాహరణకు బ్లాకుల స్థాయిని ఈ మార్గదర్శకాల్లో రూపొందించారని, కానీ చాలా రాష్ర్టాల్లో ఈ బ్లాకుల వ్యవస్థ లేదని, దీని స్థానంలో స్థానికంగా ఉన్న రెవిన్యూ వ్యవస్థకు అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, పీఎంకేవైఎస్ కింద చేపట్టిన 46 ప్రాజెక్టుల్లో కేవలం దేవాదుల మినహా తెలంగాణకు సంబంధించిన మరో ప్రాజెక్టు లేదన్నారు. అందువల్ల మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు ఉద్దేశించిన వ్యయంలో కేంద్రం వాటాను వెంటనే విడుదల చేయడం ద్వారా అనుకున్న విధంగా 2017 నాటికి అవి పూర్తవుతాయని అన్నారు. కేంద్ర జలసంఘం పనితీరును తప్పుపట్టిన హరీశ్‌రావు, ప్రాజెక్టులు సాకారం అయ్యే విధంగా కాకుండా అడ్డుకునే విధంగా ఈ సంస్థ పనితీరు ఉన్నదని, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పారు. ఒక్కో ప్రాజెక్టుకు ఏండ్ల సమయాన్ని ఈ సంస్థ తీసుకుంటున్నదని, ఈలోపు కేంద్రంలో ప్రభుత్వాలే మారిపోతున్నాయని అన్నారు.

జలసంఘం విధానం కారణంగా ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుండగా, ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమల స్థాపనకు గరిష్ఠంగా 15 రోజుల వ్యవధిని నూతన పారిశ్రామిక విధానంలో పొందుపరిచారని, ఈలోగా ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోతే స్వయం ధ్రువీకరణతో పరిశ్రమలను యజమానులు స్థాపించుకోవచ్చని, కేంద్ర జల సంఘానికి కూడా ఈ తరహా విధానాన్ని వర్తింపజేయాలని సూచించారు.

పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి సకాలంలో అనుమతులు రాకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదన్నారు. కేంద్ర జలవనరులు మంత్రిత్వశాఖ స్వయంగా చొరవ తీసుకుని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖతో మంత్రుల స్థాయి, కార్యదర్శుల స్థాయి, అధికారుల స్థాయి సమావేశాలు నిర్వహించి వీలైనంత త్వరగా అనుమతులు మంజూరయ్యేలా చూడాలని కోరారు. అవసరమైతే నెలకోసారి సమన్వయ సమావేశాలు జరుగాలని సూచించారు.

తెలంగాణ ప్రత్యేక అవసరాలను వివరిస్తూ, రాష్ట్ర సాధన డిమాండ్లలో సాగునీరు కూడా ప్రధానమైనదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల అవసరాలకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తప్పనిసరి అని, ఆ హామీలు ఆచరణరూపం దాల్చాలంటే కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను చేపట్టిన తర్వాత భూగర్భనీటిమట్టం గణనీయంగా పెరిగిందని, రసాయనిక ఎరువుల వినియోగం కూడా దాదాదు 70% తగ్గిందని చెప్పారు. తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనాలను పొందడం మిషన్ కాకతీయ లక్ష్యమని అన్నారు. మొదటి దశలో 8,200 చెరువులను పూర్తిచేశామని, రెండో దశలో పది వేల చెరువులను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

మిషన్ కాకతీయకు ఉమాభారతి ప్రశంసలు ప్రజల సహకారంతో ఏ ప్రాజెక్టు అయినా ఫలితం సాధిస్తుందనడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ నిదర్శనమని కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో తొలి దశలో సుమారు ఎనిమిది వేలకు పైగా చెరువులకు మరమ్మతు పనులు చేసిన తెలంగాణ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. మంత్రి హరీశ్‌రావు కూడా చాలా విలువైన ఐదు సూచనలు చేశారని, అనుభవంలోంచి చేసిన ఈ సూచనలు ఆచరణలో చాలా స్వాగతించదగినవని అన్నారు. ఒక రాజకీయవేత్తగా ప్రజల అవసరాలను గుర్తించి ఆచరణాత్మకమైనవిగా నిరూపించారని అన్నారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని, ప్రజలు స్వయంగా ఇందులో భాగస్తులవుతున్నారంటే వాటి ఫలితాన్ని వారు అర్థం చేసుకున్నారని, వాటి ఫలాలను అందుకునేది కూడా తామేనన్న అవగాహనను పెంచుకున్నారని అన్నారు.

ఉప కమిటీ ఏర్పాటు హరీశ్‌రావు చేసిన సూచనలపై మంత్రి ఉమాభారతి స్పందిస్తూ, ఒక ఉప కమిటీని ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. కార్యదర్శి స్థాయి నుంచి అధికారుల వరకు ఉండే ఈ కమిటీ వివిధ రాష్ర్టాల అధికారులతో చర్చించి పీఎంకేఎస్‌వై పథకంలో తగిన మార్పులు చేయడానికి ఈ సిఫారసులు చేస్తుందని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను 20 రోజుల్లోగా సమర్పిస్తే దానిని అధ్యయనం చేసి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి తగిన సవరణలు చేసి ఈ పథకం మరింత తొందరగా, రాష్ట్ర ప్రభుత్వాలు సంతృప్తి చెందేలా రూపొందిస్తామని తెలిపారు. రాష్ర్టాలకు అనుకూలమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

పీఎంకేఎస్‌వైలో ప్రాణహిత-చేవెళ్లను చేర్చండి సమావేశం అనంతరం సోమవారం రాత్రి ఉమాభారతితో భేటీ అయిన హరీశ్‌రావు కేంద్ర జలవనరుల సంఘం అధికారుల సమక్షంలో సాంకేతిక వివరాలన్నింటినీ ఆమెతో చర్చించారు. పీఎంకెఎస్‌వై పథకంలో తెలంగాణకు చెందిన మరో నాలుగు ప్రాజెక్టులను చేర్చాలని కోరుతూ ఒక విజ్ఞాపనపత్రాన్ని ఆమెకు అందజేశారు. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సుమారు 16.40 లక్షల హెక్టార్లకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి సుమారు రూ. 40 వేల కోట్ల ఖర్చుతో నిర్మాణమయ్యే ఈ ప్రాజెక్టును కూడా ఈ జాబితాలో చేర్చాలని కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఇందిరమ్మ వరదనీటి కాల్వ ఆధునికీకరణ పనులకు సుమారు రూ. 5940 కోట్లు ఖర్చవుతుందని, కేంద్ర జల సంఘం దగ్గర ఈ ఫైల్ పెండింగ్‌లో ఉన్నదని, వెంటనే అనుమతి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ నెల 29న సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి అప్పుడు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. శ్రీపాద ఎల్లంపల్లిప్రాజెక్టు ద్వారా సుమారు 1.82 లక్షల హెక్టార్ల ఆయకట్టు వినియోగంలోకి వస్తుందని, కాబట్టి రూ. 5157 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం సూత్రరీత్యా అనుమతి మంజూరు చేసినా ప్రస్తుతం సాంకేతిక సలహా కమిటీ సమావేశంలో చర్చ కోసం పెండింగ్‌లో ఉన్నదని, దీనికి కూడా త్వరగా అనుమతి మంజూరు అయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలో సుమారు రూ. 115 కోట్ల ఖర్చుతో (2006 నాటికి) 5504 హెక్టార్ల ఆయకట్టు ఉద్దేశంతో మోడికుంటవాగు ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని హరీశ్‌రావు చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 456 కోట్లకు పెరిగిందని, తదుపరి సాంకేతిక సలహా కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. పై ప్రాజెక్టులన్నింటినీ పీఎంకేఎస్‌వై పథకంలో చేర్చడం ద్వారా 2020వ సంవత్సరంకల్లా పూర్తి చేయవచ్చునని, ప్రజలకు వీటి ఫలాలను అందించవచ్చునని తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.