Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జంగిల్ బచావో జంగిల్ బడావో

– అడవుల సంరక్షణకు ముఖ్యమంత్రి సరికొత్త నినాదం
-అటవీశాఖకు సాయుధ పోలీసుల అండ
-కలప స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదుచేస్తాం
-పూచికపుల్ల కూడా బయటకుపోవద్దు
-అటవీప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చెక్‌పోస్టులు
-జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్లతో సోదాలు
-టీఆర్‌ఎస్ నేతలు స్మగ్లింగ్‌కు పాల్పడితే.. ముందు వారినే అరెస్టుచేయండి
-పర్యావరణ రక్షణ కోసం కొత్తచట్టం రూపొందించాలి
-నిధుల కొరత రాకుండా గ్రీన్‌ఫండ్ ఏర్పాటు
-అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అడవిని కాపాడాలని, పోయిన అడవిని పునరుద్ధరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జంగిల్ బచావో, జంగిల్ బడావో అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓ వైపు చెట్లు పెంచడంకోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించిపోతుంటే చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని, ఉన్న అడవిని కాపాడకుండా.. హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలుచేసినా ఫలితం రాదని అన్నారు. అడవిని కాపాడే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, ఇందుకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి పనిచేయాలని తెలిపారు. అటవీ శాఖకు సాయుధ పోలీసులు అండగా నిలుస్తారు. అడవులను నరికేవారిని, స్మగ్లింగ్‌చేసేవారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ ఉంది. వారిని గుర్తించగానే చర్యలు ప్రారంభం కావాలి. స్మగ్లింగ్ జీరోసైజుకు రావాలి. స్మగ్లింగ్‌కు పాల్పడేవారిపై పీడీ యాక్టు నమోదుచేయాలి అని స్పష్టంచేశారు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంకోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో పోలీస్, అటవీశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

అంకితభావం కావాలి
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇంకా అడవి ఉన్నది. ఆ జిల్లాల్లోనే స్మగ్లింగ్ కూడా జరుగుతున్నది. అడవులు ఎక్కువగా నరికివేతకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించాలి. అక్కడ ఒక్కచెట్టు పోకుండా జాగ్రత్త పడాలి. కఠినంగా వ్యవహరించాలి. చిత్తశుద్ధి, దృఢచిత్తం, అంకితభావమున్న అధికారులను ఆయాప్రాంతాల్లో నియమించాలి. వారికి సాయు ధ పోలీసు భద్రత కూడా అందిస్తాం. పోలీసులు, అటవీశాఖ అధికారుల సంయుక్త నిర్వహణలో (జాయింట్ ఫ్లయింగ్ స్కాడ్) అడవికి వెళ్లే అన్నిమార్గాల్లో పెద్దసంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలి. అక్కడా సాయుధ పోలీసుల పహారా పెట్టాలి. మొత్తంగా అడవిలో ఒక్కచెట్టు నరికివేతకు గురికాకుండా, అంగుళం కూడా ఆక్రమణకు లోనుగాకుండా వ్యవహరించాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అడవుల ను కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదుచేసి శిక్షిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్‌వోలు కలిసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని చె ప్పారు. క్షేత్రస్థాయిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అడవుల రక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అటవీ చట్టాలను నిశితంగా సమీక్షించాలని, అడవుల సంరక్షణతోపాటు ఆక్రమణదారులను, స్మగ్లర్లను కఠినంగా శిక్షించడానికి చట్టంలో మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పచ్చదనం పెంచడానికి బహుముఖ వ్యూహం
రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి నాలుగు విధాల చర్యలు తీసుకోవాలి. ఒకటి.. ప్రస్తుతమున్న అడవిని పూర్తిస్థాయిలో రక్షించాలి. రెండు.. అటవీ భూమిలో కోల్పోయిన పచ్చదనాన్ని (చెట్లను) పునరుద్ధరించాలి. మూడు.. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాలను పెంచాలి. నాలుగు.. హైదరాబాద్, వరంగల్‌లాంటి మహా నగరాలతోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడానికి పచ్చదనం పెంచాలి. నగరాలు, పట్టణాల్లో చెట్ల పెంపకానికి ప్రత్యేక వ్యూహం రూపొందించాలి అని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశంచేశారు. మాకు ప్రజలే ముఖ్యం. వారి భవిష్యత్తే లక్ష్యం. అంతకుమించిన ప్రాధాన్యం మరొకటి లేదు. రాజకీయ ప్రయోజనంలేదు. భావితరాలు బాగుండాలనే అడవుల రక్షణ, పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని ప్రాధాన్యాంశంగా తీసుకున్నాం. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతాం. కలప స్మగ్లింగుకు పాల్పడేవారు ఎంతటి వారైనాసరే చర్య తీసుకోవాలి. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు స్మగ్లింగుకు పాల్పడితే అందరికన్నా ముందు వారినే అరెస్టుచేయండి అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

12 శాతం కూడా పచ్చదనం లేదు
భూ భాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. తెలంగాణలో 24 శాతమే అటవీభూమి ఉన్నదని అధికారిక లెక్కల్లో ఉంది. కానీ, రాష్ట్ర భూభాగంలో 12 శాతం కూడా పచ్చదనం లేదు. అటవీ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉంది. సమైక్య రాష్ట్రంలో పెద్దఎత్తున అడవుల నరికివేత జరిగింది. లక్షల ఎకరాల్లో అడవిపోతున్నా ప్రేక్షక పాత్ర వహించారు. ఇప్పటికైనా మేల్కొనాలి. పర్యావరణం సమతుల్యంగా లేకుంటే మానవ మనుగడలేదు. అటవీ భూభాగంలో పోయిన పచ్చదనాన్ని తిరిగి సంపాదించాలి. పెద్దఎత్తున అటవీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలి. అటవీ భూభాగమంతా పచ్చని చెట్లతో నిండి ఉండాలి. అటవీభూములపై సాగుహక్కులున్న వారితో కూడా ఉభయతారకంగా ఉండే మొక్కల పెంపకం చేయించాలి. వారికి ఆదా యం రావాలి. ఇటు అడవి పెరగాలి. అలాంటి చెట్లను ఎంపికచేయాలి అని ముఖ్యమంత్రి సూచించారు.

అటవీ చట్టాలను సమీక్షించాలి
అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీచట్టాలను పూర్తిస్థాయిలో సమీక్షించాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, అడవులను రక్షించడం, స్మగ్లర్లను శిక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ రక్షణ కోసం కొత్తచట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంచే కార్యక్రమానికి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంపా నిధులను వినియోగించుకోవడంతోపాటు, బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని, అవసరమైతే గ్రీన్‌సెస్ వసూలుచేస్తామని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులనుంచి నెలకు కొంత మొత్తంలో విరాళం రూపంలో స్వీకరిస్తామని, సీఎస్‌ఆర్ నిధులను కూడా ఈ కార్యక్రమం కోసమే వినియోగిస్తామని చె ప్పారు. మొత్తంగా రాష్ట్రంలో నిధుల కొరత రాకుండా గ్రీన్‌ఫండ్ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అటవీశాఖ పీసీసీఎఫ్ పీకే ఝా, అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు నవీన్‌చంద్, స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, సీసీఎఫ్ రఘువీర్, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమ న్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భారీగా మొక్కల పెంపకం చేపట్టాలి. ప్రతీఇంట్లో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. గ్రామాల్లో చెట్ల పెంపకం కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చాం. ప్రతీగ్రామంలో కచ్చితంగా నర్సరీలు ఏర్పాటుచేయాలి. విరివిగా మొక్కలు నాటి, వాటిని రక్షించే బాధ్యతను స్థానికసంస్థలు స్వీకరించాలి అని సీఎం కేసీఆర్ కోరారు. నగరాలన్నీ కాలుష్యంతో నిండిపోయాయి. ఢిల్లీలో కాలుష్యం వల్ల రోగాలొస్తున్నాయి. మిగతా నగరాల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. హైదరాబాద్‌లో ఉండటం ఇప్పటివరకు మన అదృష్టమని భావిస్తున్నాం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే అది దురదృష్టంగా మారుతుంది. పట్టణ ప్రాంతాల్లో జనాభాకు తగ్గట్టుగా పచ్చదనం పెంచకుంటే భావితరాలకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి హైదరాబాద్, వరంగల్‌లాంటి మహానగరాలతోపాటు అన్ని నగరాలు, పట్టణాల్లో విరివిగా చెట్లు పెంచాలి. అటవీ బ్లాకులను గుర్తించాలి. వాటిని పార్కులుగా మార్చాలి. వాటిలో వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటుచేయాలి. వాకర్స్ క్లబ్బులు ఏర్పాటుచేసి, ఆయా ఫారెస్టు బ్లాకుల సంరక్షణ బాధ్యతలను వారికే అప్పగించాలి. అని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి బహుముఖ వ్యూహం రూపొందించి, అమలు చేయాలి. ప్రస్తుతమున్న అడవిని పూర్తిస్థాయిలో రక్షించాలి. అటవీ భూమిలో కోల్పోయిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాలను పెంచాలి. హైదరాబాద్, వరంగల్ లాంటి మహా నగరాలతోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నివారణకు పచ్చదనం పెంచాలి.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.