Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గజ్వేల్‌లో హరిత పండుగ

-ఆగస్టు1న లక్షా 116 మొక్కలు నాటాలి.. సీఎం కేసీఆర్ నిర్ణయం -ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటేలా చైతన్యం కల్పించాలి -వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలి -ప్రకృతిని మనమే చేజేతులా నాశనం చేసుకున్నాం -మనిషి, చెట్లు నిష్పత్తిలో దేశం వెనుకబడింది -రాష్ట్రంలో 33% పచ్చదనాన్ని సాధించాలి -గజ్వేల్ హరితహారంపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆగస్టు ఒకటిన గజ్వేల్ పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో లక్షానూటపదహారు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదే రోజు అటవీభూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్నిరకాల రోడ్ల వెంట, ప్రభుత్వ, ప్రైవేటుసంస్థల ఆవరణల్లో, గుడి, మసీదు, చర్చిలాంటి ప్రార్థనామందిరాలతోపాటు ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్దఎత్తున ప్రచారం చేయాలన్నారు.

ఈ కార్యక్రమానికి కావాల్సిన మొక్కలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలో ఆగస్టు ఒకటిన నిర్వహించే హరితహారం కార్యక్రమంపై బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణంలో ఒకేరోజు లక్షా 116 మొక్కలు నాటాలి. విద్యార్థులు, స్వయం సహాయక బృందాల సభ్యులతోపాటు మొక్కలు నాటడానికి కావాల్సినంత మందిని సమీకరించాలి. కావాల్సిన మొక్కలను ముందే సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటడానికి ముందే గుంతలు తీసిపెట్టాలి. మొక్కలు పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, అన్ని ఖాళీ ప్రదేశాలతోపాటు అన్ని ఇండ్లలోనూ కచ్చితంగా మొక్కలు నాటాలి. ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అందరూ తలా ఒక మొక్క నాటాలి. దీనికోసం ప్రజలను చైతన్యపరచాలి. అవగాహన కల్పించాలి. ఇండ్లలో నాటడానికి కావాల్సిన మొక్కలను ఒకరోజు ముందే ఆ ఇంటికి చేర్చాలి. ప్రజలకు ఇచ్చే చెట్లలో కచ్చితంగా పండ్ల చెట్లు, పూల చెట్లు ఉండాలి. ఆగస్టు 1న అనుకున్న సమయానికి గజ్వేల్ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలి. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రితోసహా.. అంతా ఒకేసారి ఎక్కడికక్కడ మొక్కలు నాటాలి అని చెప్పారు.

విరివిగా ప్రచారం కల్పించాలి ఈ కార్యక్రమంపై మైకులు, వాల్ రైటింగ్, హోర్డింగులు, పెయింటింగ్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలోని ప్రజలంతా మొక్కలు నాటేలా ప్రోత్సహించాలి. నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటర్ ట్యాంకర్లను ఏర్పాటుచేయాలి. రోడ్లపై నాటే మొక్కలకు ట్రీగార్డులు పెట్టాలి. పట్టణంలో తుమ్మ, జిల్లేడులాంటి పిచ్చి మొక్కలను తీసేసి.. మంచి మొక్కలను మాత్రమే పెంచాలి. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ధ చూపినవారికి అవార్డులుకూడా అందించాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.

జీవించే స్థితి ఉండాలి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నాం. కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. 2019 జూన్ నుంచి పుష్కలంగా నీళ్ళు వస్తాయి. చెరువులన్నింటినీ కాల్వల ద్వారా నింపుతాం. లక్షా 25 వేల కోట్ల రూపాయల విలువైన పంట పండుతుంది. వ్యవసాయం బాగుపడుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్య అందుతున్నది. రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతున్నది. ఇంత చేసినా జీవించగలిగే పరిస్థితులు లేకుంటే దండుగ. మనిషి జీవించగలిగే పరిస్థితి కావాలి అని ముఖ్యమంత్రి అన్నారు.

పోయిన పచ్చదనాన్ని తిరిగి పొందేందుకే భగవంతుడో.. ప్రకృతో.. మనకు కావాల్సినవన్నీ సమకూర్చింది. కానీ మనమే వాటిని చేజేతులా నాశనం చేసుకున్నాం. నాశనమైన వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యతకూడా మనదే. పోయిన అడవులను, పచ్చదనాన్ని తిరిగి పొందేందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టాం. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించాం. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటుచేస్తున్నాం. ఆ నర్సరీల్లో ఇతర మొక్కలతోపాటు కనీసం 25 శాతం పండ్ల మొక్కలను సిద్ధం చేయాలి. చెట్ల పండ్లు దొరికితే కోతులు జనావాసాలపై పడే పరిస్థితే ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద అడవి పునరుద్ధరణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. దానిని ఆదర్శంగా తీసుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

మన దేశంలో మనిషికి 28 చెట్లే మనిషి, చెట్టు నిష్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. కెనడాలో ప్రతిమనిషికి సగటున 8,953 చెట్లు, రష్యాలో 4,465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉంటే.. భారతదేశంలో ఒక్కో మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇది వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి, ఉష్ణోగ్రతలు పెరుగడానికి కారణమవుతున్నది. అందుకే మనం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఉద్యమస్థాయిలో నిర్వహిస్తున్నాం. 33% పచ్చదనం కోసం పరితపిస్తున్నాం. పచ్చదనం పెంచాలనే తపనతో పనిచేయాలి. పోయిన అడవిని పునరుద్ధరించాలి. మొక్కలు నాటడం, వాటిని రక్షించడం ప్రధాన విధి కావాలి. దీనికి నిధుల కొరత లేదు. ఉపాధి నిధులు వాడుకోవాలి అని సీఎం అన్నారు. సమావేశంలో మంత్రులు జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పీసీసీఎఫ్ పీకే ఝూ, ఏపీసీసీఎఫ్ దోబ్రియాల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూమారెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్ పట్టణంలో ఆగస్టు ఒకటిన నిర్వహించే హరితహారం కార్యక్రమంపై బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఉన్నారు మనిషి, చెట్టు నిష్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. కెనడాలో ప్రతి మనిషికి సగటున 8,953 చెట్లు, రష్యాలో 4,465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉంటే.. భారతదేశంలో ఒక్కో మనిషికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.