ఐకేపీ కేంద్రాలను మూసివేయం

-వాటి ద్వారానే ధాన్యం కొనుగోళ్లు..
-ఖరీఫ్‌లో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం,4లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యం
-పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు

IT and Panchayat Raj Minister KT Rama Raoఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కేంద్రాల ద్వారానే వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లు కొనసాగుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఐకేపీ కేంద్రాలను మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను యథాతథంగా కొనసాగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఐకేపీ కేంద్రాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2015-16 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని 240 మండలాల్లో ఏర్పాటుచేసిన ఐకేపీ కేంద్రాల ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 46 మండలాల్లో ఏర్పాటు చేసిన 50 కేంద్రాల ద్వారా 4లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 12లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు డిమాండ్ ఎక్కడ అధికంగా ఉంటుందో అక్కడ కొత్త కేంద్రాలు తెరిచేందుకు చర్యలు చేపట్టాలని పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

మహిళా సంఘాల ద్వారా జరిగే ధాన్యం కొనుగోళ్లను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతులకు మద్దతు ధర విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం బస్తాకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, మార్కెట్ యార్డుల ద్వారా సైతం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు.