వాటర్‌గ్రిడ్ పనులు వేగవంతం చేయండి

-అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
-ఆర్‌డబ్ల్యూఎస్, ఐటీ శాఖల పనుల సమీక్ష
-జూన్ 2 నాటికి హైదరాబాద్‌లో వై-ఫై సేవలు విస్తరిస్తామని వెల్లడి

KTR review on watergrid project

వాటర్‌గ్రిడ్ పనులను మరింత వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు. జూన్ రెండో వారం నాటికి హైదరాబాద్ నగరంలోని మరో 40 చారిత్రక , టూరిస్టు ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆయన, మంగళవారం సచివాలయంలో ఆ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణాల పురోగతిపై చర్చించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు, సమాచారం అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించి ఫోటోలే కాకుండా ప్రతి రోజు వీడియో ఫుటేజీలను కూడా కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ప్రాజెక్టు పనులపై వివరణాత్మక నివేదికను వాప్కోస్‌తో స్క్రూటినీ చేయించే పనిని బుధవారంలోగా పూర్తి చేయించాలన్నారు.
రెండు వారాల్లోపు పూర్తి స్థాయి స్క్రూటినీ జరిగేలా వాప్కోస్ ఎండీతో ప్రత్యేకంగా మాటాడాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డికి సూచించారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రైల్వేశాఖతో మాట్లాడి, ప్రాజెక్టుకు కావాల్సిన చోట్ల అనుమతులు పొందాలన్నారు. అమెరికా పర్యటనలో పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, వారితో ప్రభుత్వం తరపున సంప్రదించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న టీఎస్ ఐపాస్ విధానాన్ని పరిశ్రమ వర్గాలకి మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.