వాటర్ గ్రిడ్ పథకం అద్భుతం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం చాలా అద్భుతంగా ఉందని, కొత్త రాష్ట్రమైనా ఇలాంటి బృహత్తరమైన ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం అభినందించదగ్గ అంశమని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ అన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై బీరేంద్రసింగ్‌తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీలో సోమవారం చర్చించారు.

KTR-with-Jithendra-singh

-కేంద్ర సాయంతోపాటు విదేశీ ఆర్థిక సాయం అందిస్తామన్న కేంద్రమంత్రి చౌదరి బీరేంద్రసింగ్
-గ్రామీణ రోడ్లకు కేంద్ర సాయం అవసరం
-కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రికి కేసీఆర్ విజ్ఞప్తి
-కేంద్రమంత్రితో భేటీలో కేటీఆర్, రేమండ్ పీటర్, నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్
ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావుతోపాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎంవో కార్యదర్శులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్ తదితరులు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.42 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ (జలహారం) ప్రాజెక్టు విశిష్టతను తెలిపి.. తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు సుమారు రూ. 29 వేల కోట్లు ఖర్చవుతుందని, మిగిలింది పట్టణ ప్రాంతాల్లో ఖర్చవుతుందని ఆయన తెలిపారు.

గుజరాత్‌లో గ్రామాలను యూనిట్ తీసుకుని మోడల్ వాటర్ గ్రిడ్ అమలవుతుండగా, గ్రామాల్లో ఒక ఇంటిని యూనిట్‌గా, పట్టణ ప్రాంతాల్లో వార్డులను యూనిట్‌గా తీసుకుని తమ ప్రభుత్వం అమలు చేయనున్నదని వివరించారు. అనంతరం వాటర్ గ్రిడ్ పథకం చేపట్టడం సంతోషకరమని కేంద్రమంత్రి ప్రశంసించారు. అందుకు ఒకటి రెండు రోజుల్లో ఆర్థికమంత్రితో సమావేశం జరుగుతుందని, సాధ్యమైనంత మేరకు కేంద్ర తరఫున నిధుల కేటాయింపు, సహకారం, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణం పొందడంలో ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) నిబంధనల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టును ప్రత్యేకమైనదిగా పరిగణించి ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రుణ పరిమితికి మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా కొన్ని నిధులను కేటాయించాలని కేసీఆర్ కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద కేవలం రూ.22 వేల కోట్ల నిధులన్నాయని, ఈశాన్య రాష్ర్టాలతోపాటు కరువుపీడిత , ఇతర రాష్ర్టాలకు 22% ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల ఆర్థిక మంత్రితో చర్చించి సహకారాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు.

రోడ్ల నిర్మాణానికి నిధులు పెంచండి
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, విస్తరణకు ప్రధాని గ్రామీణ సడక్ యోజన పథకం కింద రాష్ర్టానికి ఇస్తున్న నిధులను పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రతి ఆర్థిక సంవత్సరం తెలంగాణ రాష్ర్టానికి సుమారు రూ.600 కోట్ల వరకు కేంద్రం నుంచి ఈ పథకం కింద నిధులు అందుతుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి ఇంకా అందాల్సిన సుమారు రూ. 90 కోట్ల నిధులను రూ. 300 కోట్లకు పెంచి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సి ఉన్నదని, ప్రధానిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించానని గుర్తుచేశారు.

పేదరిక విభజన అశాస్త్రీయం
రాష్ట్ర విభజన నేపథ్యంలో పేదరికాన్ని 58:42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య విభజన చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, ఈ పద్ధతి వల్ల తెలంగాణలో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల సంఖ్య తగ్గినట్లుగా, ఏపీలో ఎక్కువ మంది పేదవారు ఉన్నట్లుగా తేలుతుందని సీఎం తెలిపారు. పేదరికాన్ని బట్టి కేంద్రం నుంచి పలు సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదలవుతాయని, కాబట్టి అశాస్త్రీయ విభజన వల్ల రాష్ట్రం నష్టపోతుందని అన్నారు ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడు స్వయం సహాయక బృందాలు, వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదల జరిగిందని, ఇప్పు డు తెలంగాణ రాష్ట్రంలో పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను గుర్తించాలని, కోరారు. కేంద్రమంత్రి స్పందిస్తూ ప్లానింగ్ కమిషన్‌లో రికార్డుల ప్రమాణికంగా ఆర్థికశాఖతోపాటు, తమ శాఖ కూడా నిధులను విడుదల చేస్తుందని వివరించారు.

ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉనికిలో లేనందువల్ల నీతి ఆయోగ్ వ్యవస్థ ఆధారంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని పేదరికానికి గుర్తించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ లాంటి పథకాలు చాలా ప్రయోజనకరమైనవని, కొత్త రాష్ట్రమైనా ఇలాంటి బృహత్తరమైన ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం అభినందించదగ్గ అంశమని అన్నారు. ఈ పథకానికి అవుతున్న భారీ ఖర్చును కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు సహజంగానే భరించలేవని, కేంద్రం సాయం చేయక తప్పదని, అయితే ఇంత హెచ్చుమొత్తంలో ఇచ్చే పరిస్థితి లేనందువల్ల విదేశీ ద్రవ్య సంస్థల నుంచి సమకూర్చడానికి కేంద్రం సాయం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కూడా మద్దతునిస్తుందని అన్నారు. అవసరమైతే కేసీఆర్ కోరినట్లుగా రుణసౌకర్యం పొందడంలో రాష్ర్టానికి ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు ఒక రకంగా ఆటంకంగా ఉంటాయి కనుక ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి ఈ మేరకు వెసులుబాటు కల్పించడానికి కృషిచేస్తానని తెలిపారు.

ఉపాధి హామీని కుదించవద్దు
తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని కుదించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం 443 మండలాల్లో సుమారు 8880 గ్రామపంచాయతీల్లో సుమారు 55 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారని ఈ పథకాన్ని జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని కుదించాలని కేంద్రం భావిస్తున్నదనే వార్తలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ఈ పథకాన్ని కుదిస్తే కేవలం 78 మండలాల్లో మాత్రమే అమలయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలను ప్రామాణికంగా తీసుకున్నట్లయితే తెలంగాణలో కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుందని, దాని వల్ల ఈ పథకం లక్ష్యమే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.