వాటర్‌గ్రిడ్ కోసం దేశం ఎదురు చూస్తున్నది

– ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
– పనుల పురోగతిపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలి
– ప్రజలకు మంచినీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరగాలి
– సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్

KCR review meet on progress of water grid project

వాటర్‌గ్రిడ్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని, ఈ ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లాల ద్వారా పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నదని, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి పారదర్శకంగా పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలువాలని చెప్పారు.

ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రామచంద్రన్, ఈఎన్‌సీ సీ సురేందర్‌రెడ్డి, సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, ఇతర పనులపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజలకు మంచినీరు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యమైన విషయన్నారు. అధికారులు పనులను చాలా శ్రద్ధగా చేయాలన్నారు. ఈ మేరకు ప్రాజెక్టు పనుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏ జిల్లాకు, ఏ మండలానికి ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తారనే విషయంపై అధికారులతో చర్చించిన తరువాత సీఎం పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రజలు వాటర్‌గ్రిడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు.

11న సీఎం అధ్యక్షతన గ్రామజ్యోతి సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన గ్రామజ్యోతి ప్రాజెక్టుపై ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరుగనున్నది. ఉదయం 11 గంటలకు హైటెక్స్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఇవోలు, సీపీవోలు, చేంజ్ ఏజెంట్లు పాల్గొంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.