వాటర్‌గ్రిడ్ దార్శనికతకు నిలువుటద్దం

-రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు యూపీ సీఎం అఖిలేశ్ ప్రశంస
-యూపీలో పర్యటించాలని కేటీఆర్‌కు ఆహ్వానం
-ప్రతిగా తెలంగాణకు రావాలని అఖిలేశ్‌కు కేటీఆర్ ఆహ్వానం

KTR
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ గొప్ప పథకం అని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రశంసించారు. ఈ పథకం అమలుపై తన అధికారుల ద్వారా పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న అఖిలేశ్.. దాని తీరు తెన్నులతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావుకు ఫోన్ చేసి అభినందించిన అఖిలేశ్.. యూపీలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. వాటర్‌గ్రిడ్ పథకం దార్శనికతకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలో పెద్ద ఎత్తున పథకాన్ని పట్టాలెక్కించిందని తమ అధికారులు చెప్పారన్నారు.
దీనిపై తమకు తెలంగాణ ఇంజినీర్ల ద్వారా తెలియజేయాలని మంత్రి కేటీఆర్‌ను అఖిలేశ్ కోరారు. ఇందుకోసం ఈ నెల 15న యూపీకి రావాలని మంత్రి కేటీఆర్ బృందానికి ఆహ్వానం పలికారు. తాగునీటి రంగంలో వాటర్ గ్రిడ్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అఖిలేశ్ అన్నారు. అయితే ముందు స్వయంగా వచ్చి పథకం అమలుతీరును పరిశీలించాలని అఖిలేశ్ యాదవ్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ పథకం అమలుతో దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని అఖిలేశ్‌కు వివరించారు. తమకు తెలంగాణ వాటర్‌గ్రిడ్‌పై పూర్తి సమాచారం ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని.. త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని అఖిలేశ్ తెలిపారు.