వాటర్‌గ్రిడ్ భేష్

-ఈ ప్రాజెక్టు మిగతా రాష్ర్టాలకు ఆదర్శం
-బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రశంసలు
-ప్రాజెక్టు తీరును పరిశీలించేందుకు
రాష్ర్టానికి వచ్చిన బెంగాల్ అధికారులు
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ

KTR-explaining about watergrid with west bengal irrigation engineers

ఫ్లోరైడ్‌బారిన పడకుండా రాష్ట్ర ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని అన్ని రాష్ర్టాలు కీర్తిస్తున్నాయి. వాటర్‌గ్రిడ్ పథకం అద్భుతంగా ఉందని, మంచినీటిని అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసిస్తున్నారు.
బెంగాల్‌లోనూ ఇలాంటి పథకాన్ని ప్రారంభించే యోచనతో.. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించి తెలుసుకునేందుకు అధికారుల బృందాన్ని మన రాష్ర్టానికి పంపారు. ఈ బృందం బుధవారం మంత్రి కే తారకరామారావుతో ఆయన క్యాంప్ ఆఫీస్‌లో సమావేశమైంది. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుపై ఆసేతు హిమాచలం ఆసక్తి చూపుతున్నది.

నిన్న ఉత్తరప్రదేశ్ సీఎం ప్రాజెక్టు వివరాలను స్వయంగా తెలుసుకోగా.. నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారుల బృందాన్ని పంపారు. ఆ రాష్ర్టానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు అధికారులు క్యాంప్ ఆఫీస్‌లో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి వారికి మంత్రి వివరించారు. తెలంగాణ ఆడపడుచులెవరూ మంచినీటికోసం ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును చేపట్టారని పేర్కొన్నారు.

రానున్న మూడున్నరేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని కేసీఆర్ వాగ్దానం చేశారని వారికి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించిందన్నారు. ప్రాజెక్టు నిధుల సమీకరణకు అవలంబించిన విధానాలను అధికారులకు మంత్రి వివరించారు. బెంగాల్‌లో ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులాంటి పథకాన్ని ప్రారంభించాలన్న యోచనతో ఉన్నారని అధికారుల బృందం పేర్కొన్నది. అంతకుముందు ఉదయం ఆర్‌డబ్ల్యుఎస్‌అండ్‌ఎస్ ఆఫీసులో ప్రాజెక్టు ఈఎన్‌సీ బీ సురేందర్‌రెడ్డి బెంగాల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో బెంగాల్ డబ్ల్యుఎస్‌ఎస్‌ఓ డైరెక్టర్ అనిమేశ్ భట్టాచార్య, పీహెచ్ ఈడీ ఈఈలు పిడెయ్, ఏ రాయ్ పాల్గొన్నారు.