వ్యవసాయానికీ పెద్దపీట వేస్తాం

-ఆర్థిక శాఖ మంత్రి ఈటెల స్పష్టీకరణ

Finance Minister Etela Rajendar

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యాంశాలని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలుకి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. అన్ని వర్గాల సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఈటెల వివరించారు. సంక్షేమ పథకాల తరువాత నీటి పారుదల రంగానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి నీటిని అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆర్థిక శాఖ తీరుతెన్నులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పగ్గాలను ఇప్పుడిప్పుడే చేపట్టినందున ఆర్థిక రంగం పూర్వాపరాలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు.