విశ్వనగరానికి.. ఒక్కో అడుగు

విశ్వనగర ప్రణాళిక అమలుకు రాష్ట్ర సర్కారు పకడ్బందీ కార్యచరణతో సన్నద్ధమవుతోంది. సుమారు రూ.20వేల కోట్లతో 100 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వేలు, 300 కిలోమీటర్ల పొడవున అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల పునరుద్ధరణ, 50 జంక్షన్ల వద్ద గ్రేడ్ సెపరేటర్ల ఏర్పాటు తదితర బృహత్తర ప్రాజెక్టుల కోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటితో పాటు నాలాల విస్తరణ, హరితహారం, చెరువుల ఆధునీకరణ, మురికి వాడల్లో ఇండ్ల నిర్మాణం.. ఇలా రోడ్లు మొదలు శ్మశానవాటికల వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయ వనరులను సమకూర్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

KCR-(1)

-రూ. 20వేల కోట్లతో బృహత్తర ప్రాజెక్టులు
-నిధుల సమీకరణపై సర్కారు దృష్టి
-ఫైనాన్స్ కన్సల్టెంట్లతో బల్దియా సమావేశం
-సానుకూలంగా స్పందించిన ప్రతినిధులు
-అభివృద్ధి పనులపై సంక్రాంతికి ముందే సీఎం కేసీఆర్ ప్రజలతో ముఖాముఖి
-రూ.20వేల కోట్లు కావాలని అంచనా
-ఆర్థిక సంస్థలతో జీహెచ్‌ఎంసీ సమావేశం
-ప్రజెంటేషన్ సిద్ధం చేసిన అధికారులు
ఇందులో భాగంగా గురువారం ఫైనాన్స్ కన్సల్టెంట్లతో బల్దియా అధికారులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల వివరాలు తెలిపి అవసరమయ్యే నిధుల గురించి తెలిపారు. సానుకూలంగా స్పందించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు పదిహేను రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిటీలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను సీఎం కేసీఆర్ సంక్రాంతి పండుగకు ముందే టీవీ ద్వారా ప్రజలకు తెలియజేసి, అభిప్రాయాలు, సూచనలు తీసుకోనున్నారు.
విశ్వనగరంలో చేపట్టనున్న ప్రాజెక్టుల కోసం సుమారు రూ.20వేల కోట్లు కావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనాలు రూపొందించారు. వాటిని వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఆర్థిక రంగానికి చెందిన కన్సల్టెంట్లతో జీహెచ్‌ఎంసీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వివరాలు వారికి వివరించి, దశలవారీగా అవసరమయ్యే నిధుల గురించి తెలిపారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఆదాయ మార్గాలు, రీపేమెంట్‌కు తీసుకునే చర్యలను కూడా వివరించారు.

దీనిపై కన్సల్టెన్సీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి, పదిహేను రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, నగరంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి ప్రాజక్టుల వివరాలను స్వయంగా ముఖ్యమంత్రే టీవీ ద్వారా ప్రజలకు వివరించి, వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోనున్నారు. సంక్రాంతి పండుగకు ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు సుమారు రూ.20వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర సమాచారంతో ప్రజెంటేషన్‌ను కూడా సిద్ధం చేశారు.

నగరానికి పూర్వవైభవం తేవడమే కాకుండా పోటీ ప్రపంచానికి దీటుగా విశ్వనగర స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర సర్కారు నడుంబిగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పథకాలు, నగర రూపురేఖలు ఎలా ఉండాలనే విషయమై పలుమార్లు అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్ రోడ్ల నుంచి శ్మశానాల వరకు అన్నింటినీ సమూలంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సుమారు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.

ఇందులో ముఖ్యంగా 100 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వేలు, 300 కిలోమీటర్ల పొడవున రోడ్ల పునరుద్ధరణ, 50 జంక్షన్ల వద్ద గ్రేడ్ సెపరేటర్ల(ైఫ్లెఓవర్లు)కు దాదాపు రూ. 17,500కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇవి కాకుండా నాలాల విస్తరణ, పాదచారుల వంతెనలు, చెరువులు, శ్మశానాల అభివృద్ధి, మూత్రశాలలు, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, హరితహారం, నైట్ షెల్టర్లు, యాచకుల సంక్షేమం తదితర పథకాల కోసం మరో రెండున్నర వేల కోట్లవరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీని పేపర్‌లెస్ ఆఫీసుగా మార్చేందుకుగాను ఈ-ఆఫీస్‌ను ప్రవేశపెట్టారు.

ప్రాజెక్టుల ప్రణాళికలు
అనేక ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన నాలాల విస్తరణ పనులను వెంటనే చేపట్టేందుకు కమిషనర్ ప్రణాళికలు రూపొందించి, ఒక్కో స్ట్రెచ్ బాధ్యతను ఒక్కో ఇంజినీర్‌కు అప్పగించారు. భూసేకరణ అవసరంలేని చోట వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. కబ్జాలు తొలగించాల్సిన చోట కబ్జాదారుల జాబితాను సిద్ధం చేశారు. అలాగే, చెరువులు, శ్మశాన వాటికలను ఆధునికీకరించేందుకు ప్రఖ్యాత డిజైనర్ల ద్వారా నమూనాలు సిద్ధం చేశారు.

సర్కిల్‌కు రెండు చొప్పున అభివృద్ధి చేయనున్న చెరువులు, శ్మశానాలను గుర్తించారు. మురికివాడల అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు, రెండు పడక గదుల నిర్మాణానికి సర్కిళ్లవారీగా సమగ్ర సమాచారాన్ని సేకరించడంతోపాటు ఐడీహెచ్ కాలనీ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు అధికారులు అన్ని ప్రాజక్టులపై సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సిద్ధంచేసి సీఎంకు సమర్పించారు. పండుగకు ముందే వీటిని సీఎం ప్రజలకు వివరించే అవకాశముంది.

ముఖ్యమైన ప్రాజెక్టులు
-100కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో భాగంగా ఎనిమిది రోడ్లు, ఎనిమిది జంక్షన్ల అభివృద్ధి. వీటితోపాటు మరో 50 జంక్షన్ల వద్ద ైఫ్లెఓవర్ల నిర్మాణం.
-300కిలోమీటర్ల పొడవున రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడం.
-100 పాదచారుల వంతెనలు నిర్మించడం
-సర్కిల్‌కు రెండు చొప్పున 36 శ్మశానవాటికలు, 36 చెరువులు ఆధునికీకరణతోపాటు మురికివాడల అభివృద్ధి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం.
-ప్రధాన రోడ్ల వెంట 1000 మూత్రశాలల నిర్మాణం
-మహిళల కోసం 100 మూత్రశాలలు
-1000 కిలోమీటర్ల పొడవున రోడ్ల వెంట గ్రీన్ కర్టెన్ పేరుతో మొక్కలు, ఖాళీ స్థలాల్లో కోటి మొక్కల పెంపకం.

-నగరంలోని మొత్తం మూడున్నర లక్షల వీధిలైట్లను ఎల్‌ఈడీగా మార్చడం.
-జీహెచ్‌ఎంసీ పరిధిలో 50వేల సీసీ కెమెరాల ఏర్పాటు
-ప్రధాన ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్ల నిర్మాణం.
-యాచకుల సంక్షేమం కోసం గౌరవ సదన్‌ల ఏర్పాటు
-100కిలోమీటర్ల పొడవున ప్రధాన నాలాల విస్తరణ
-15 ప్రధాన మార్కెట్ల అధునికీకరణ