విశ్వనగరంగా హైదరాబాద్

ఐటీఐఆర్‌తో అంతర్జాతీయస్థాయి
– మురికివాడలు లేని నగరాన్ని నిర్మిస్తా
– నగరాన్ని యూటీ చేసేందుకు వెంకయ్య, బాబు కుట్రలు
– మన తలరాతను మనమే మార్చుకోవాలి
– గ్రేటర్ సభల్లో కేసీఆర్ వ్యాఖ్య

KCR Public meetings in hyderabad 28-08-14
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వస్తుందని, దాని ద్వారా అదనంగా 30 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్‌లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేపట్టి.. నగరంలోని ఎల్బీనగర్, కుషాయిగూడ, బోడుప్పల్, చిలకలగూడ, ఫిల్మ్‌నగర్ సభల్లో ప్రసంగించారు.

ఐటీఐఆర్ ప్రాజెక్టు రావడంతో ప్రస్తుతమున్న హైదరాబాద్ రెండింతలు పెరుగుతుందని, గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నగర జనాభా రెండు కోట్లకు చేరుకుంటుందని, దానికి అనుగుణంగా హైదరాబాద్‌కు అవసరమైన విద్యుత్, తాగునీటి వసతులతోపాటు అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు వేల మురికి వాడలు ఉన్నాయని, వాటిలో ఉంటున్న బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. ప్రతి పేద కుటుంబానికి రెండు బెడ్‌రూంలు, కిచెన్, హాల్‌తో కూడిన పక్కా ఇంటిని ఒక్క రూపాయి రుణం లేకుండా నిర్మించి ఇస్తామన్నారు. మురుగువాడలు లేని హైదరాబాద్‌ను తయారుచేసుకుందామని, హైదారాబాద్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని అన్నారు. జంట నగరాల్లోని గీతా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. ఆటోలకు రోడ్డు పన్ను రద్దు చేస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని హామీనిచ్చారు.

Public

హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్రలు..
ఒకటి ఒకటి ఒకటి కలిస్తే 111 అని మోడీ పేర్కొన్నడం ప్రజలకు పంగనామాలు పెట్టడమేనని ఎద్దేవా చేశారు. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ ముగియగానే సీమాంధ్ర ప్రచారంలో హైదరాబాద్‌ను యూటీగా చేస్తామని నరేంద్రమోడీ ప్రకటించేలా చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణలో ఎన్నికలు ముగిసిన గంటలోపే వైఎస్ హైదరాబాద్‌కు వెళ్ళాలంటే వీసా కావాలని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే అధోగతి తప్పదన్నారు. ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. నగర శివారు గ్రామమైన ఫిర్జాదిగూడ ప్రజలకు ఐదు వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని ప్రకటించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ అభ్యర్థి పద్మారావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిని చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ అధినేత ఆదివారం జరిపిన సుడిగాలి పర్యటన నేపథ్యంలో గ్రేటర్ గులాబీమయంగా మారింది. ఈ సభలలో మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తూమ్ భీమ్‌సేన్, ఉప్పల్ పార్టీ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు, ఎల్బీనగర్ అభ్యర్థి ఎం.రాంమోహన్‌గౌడ్, ఖైరతాబాద్ అభ్యర్థి మన్నె గోవర్థన్‌రెడ్డి, మేడ్చల్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ అభ్యర్థి మురళీధర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, సమయాభావం వల్ల ఆదివారం కేసీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ ఎన్నికల సభకు హాజరు కాలేకపోయారు.