విశ్వకేంద్రంగా హైదరాబాద్

-నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం
-ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
-అడ్డగుట్టలో ఇండ్ల పట్టాల పంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

KTR-laid-foundation-stone-for-double-bed-room-houses-at-Addagutta

హైదరాబాద్‌ను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌లో ఇండ్ల పట్టాల పంపిణీ, 200 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా 192 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడంతోపాటు అదే ప్రాంతంలో ఇండ్లురాని నిరుపేద ప్రజలకు 200 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మన బతుకులను మనం బాగుచేసుకోవడానికి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వమే సొంతంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 29 లక్షల మందికి పింఛన్ ఇస్తే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 38 లక్షల మందికి పింఛన్లను అందజేయడం జరుగుతున్నదని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూబ్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసే అభివృద్దిని చూసి ఓర్వలేకనే వివక్షాల నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ది చేసి చూపించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన సమయంలో మొదటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, తుకారాంగేట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) పనులకు త్వరలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దేవాదాయ, గృహా నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో లక్ష ఇండ్లను ఇస్తామని, కృష్ణా-3 ఫేజ్ కూడా ప్రారంభమైందని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ పనితనానికి నిదర్శనం ఐడీహెచ్ కాలనీ ఇండ్లని కొనియాడారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జోనల్ కమిషనర్ హరిచందన, ఆర్టీవో రఘురాం శర్మ పాల్గొన్నారు.