విషబీజాలు నాటుతున్న చంద్రబాబు

-సచివాలయం కంచె నిర్ణయం ఇప్పటిది కాదు
-పోలవరం నిర్మాణం అడ్డుకుంటాం
-ముంపు గ్రామాలు మా రాష్ట్రంలోనే ఉంచాలి
-పీపీఏల రద్దు సమయంలో చర్చలు గుర్తుకు రాలేదా?
-భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు

Harish Rao 02
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఇరు రాష్ర్టాల ప్రజల మధ్య శాశ్వతంగా విష బీజాలు నాటడానికి కుట్ర చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెట్ శాఖ మంత్రి టీ హరీష్‌రావు ఆరోపించారు. సచివాలయాల మధ్య ఇనుప కంచెను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నట్టు చంద్రబాబు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇనుప కంచె ఏర్పాటు నిర్ణయం రాష్ట్రపతి పాలన కాలంలో గవర్నర్ తీసుకున్నదే తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది కాదన్నారు. వాస్తవం ఇలా ఉండగా టీఆర్‌ఎస్ నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ చంద్రబాబు తమపైనే అభాండాలు వేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ఏపీ ప్రభుత్వం అడుగడుగునా కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.

రాష్ర్టానికి విద్యుత్, సాగునీరు రాకుండా చేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తుంటే టీటీడీపీ నేతలు ఆ ప్రయత్నాలు నిలదీయకుండా తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామన్న చంద్రబాబు కేంద్రంలో మంత్రి పదవి, పార్లమెంటరీ నేత పదవిలో ఒక్కటికూడా తెలంగాణ వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరి ఏమిటో దానితో తేలిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ గిరిజనులను నిర్వాసితులను చేయడమే కాకుండా తెలంగాణను చీకట్లో ముంచడానికి చంద్రబాబు రాత్రికి రాత్రే ఢిల్లీలో లాబీయింగ్ చేయించి పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చంద్రబాబు కుట్రలు చేశాడన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పారు.

పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించాలని చెబుతున్న చంద్రబాబు పీపీఏల రద్దు, పోలవరం ఆర్డినెన్స్ వంటి అంశాలపై చర్చను ఎందుకు కోరలేదని నిలదీశారు. చంద్రబాబు తీరు అందితే జుట్టూ,లేకుంటే కాళ్ల వ్యవహారంగా ఉందని ఎద్దేవా చేశారు. విభజన బిల్లుకు తూట్లు పొడుస్తున్నది చంద్రబాబేనని, ఆయన చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేది చీకటి పనులన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండానే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునే కేసీఆర్ పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూలగొట్టడం చంద్రబాబుకు ఎందుకు తప్పుగా కనపడిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని స్వీకరించిన వ్యక్తి అక్రమ నిర్మాణాలను కూలుతుంటే చూసి తనకు బాధ కలిగించిందనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

బాధ్యత కలిగిన నాయకుడెవరైనా తప్పులను సమర్థిస్తారా?అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే గురుకుల ట్రస్ట్ భూములను ఆక్రమించిన వారితో సంబంధాలున్నాయేమోననే అనుమానం కలుగుతుందన్నారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా విదేశీ పెట్టుబడుదారులు తరలివస్తున్నారని, దానికి ఇటీవల హీరో మోటర్ సైకిల్, ఆస్ట్రేలియా, సింగపూర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలే నిదర్శనమని అన్నారు.

హరీశ్‌కు అదనంగా గనులు, భూగర్భ వనరుల శాఖ
-సీఎం కేసీఆర్ సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్
రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతలను మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు అప్పగిస్తూ.. గవర్నర్ నర్సింహన్ గురువారం ఉత్తర్వులు జారీశారు. ఇప్పటికే హరీశ్‌రావు నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సిఫారసు మేరకు గవర్నర్ మరో శాఖ కేటాయించారు. హరీశ్‌రావుకు ఈ శాఖను అప్పగించడం ప్రణాళికాబద్ధంగానే సాగింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయనకు ఈ ప్రాంతంలోని సహజ వనరులపై అవగాహన ఉంది. ప్రధానంగా ఐరన్ ఓర్, బెరైటీస్, స్పియటైట్, సున్నపురాయి, బాక్సైట్, గ్రానైట్, యురేనియం వంటి ఖనిజ నిక్షేపాలపై హరీశ్ అధ్యయనం చేసినట్లు గనుల శాఖ అధికారులు చెప్పారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో ముడి ఇనుప గనుల పరాయీకరణ జరుగకుండా ఆయన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో రక్షణ స్టీల్స్‌కు కేటాయించిన బయ్యారం నిక్షేపాల లీజు రద్దయింది. విస్తారమైన ఈ గనులను సద్వినియోగం చేసుకునేందుకు కావాల్సిన పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో గనులు, భూగర్భ వనరుల శాఖకు మంత్రిని ఖరారుచేయడం వల్ల పరిశ్రమల స్థాపన ప్రక్రియ మరింత వేగీరమయ్యే అవకాశం ఏర్పడింది.