విద్యుత్ ప్రాజెక్టులకు 20వేల కోట్లు

– అంగీకరించిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్
– సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్‌ఈసీ, టీఎస్‌జెన్‌కో సీఎండీ చర్చలు

KCR 01
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్ల రుణం మాజూరు కానుంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) ఈ రుణాన్ని ఇవ్వనుంది. ఆర్‌ఈసీ సీఈవో రాజీవ్‌శర్మ, తెలంగాణ స్టేట్ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టులు, అయ్యే వ్యయం, వనరుల సమీకరణ తదితర అంశాలపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ డిమాండ్ ఉండటం, అదే సమయంలో సాగునీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం, పరిశ్రమలకు విద్యుత్, కొత్తగా ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు, తాగునీటి గ్రిడ్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగనుందని సీఎం తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 8వేల మెగవాట్ల విద్యుత్ ప్రాజెక్టులున్నాయని, దీనికి అదనంగా 12వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు స్వల్పకాలిక వ్యూహం, రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఉండే అవసరాలను తీర్చేందుకు మధ్యంతర వ్యూహం, పది-పదిహేనేళ్లపాటు విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించామని తెలిపారు.

వచ్చే ఏడాది చివర్లో అందుబాటులోకి 2800మెగావాట్లు
భూపాలపల్లి కేటీపీఎస్, జైపూర్ సింగరేణిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల విస్తరణకు సంబంధించిన అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది చివరినాటికి 2800మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మూడు ప్రాజెక్టుల నుంచి విద్యుత్ అందుబాటులోకి వస్తే కొంతమేరకు డిమాండ్‌ను అధిగమించవచ్చని సీఎం అన్నారు.