విద్యుత్ కోతలు లేకుండా చేశాం

– ఆ విషయం రైతులు, ప్రజలకు తెలిసింది
– వచ్చే ఏడాది నుంచి రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్
– అసెంబ్లీ లాబీలో మంత్రి హరీశ్‌రావు

Harish Rao

ఈ ఏడాది ఎలాంటి కోతలు లేకుండా కావాల్సినంత విద్యుత్‌ను ఇస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. విద్యుత్ సరఫరాలో గతేడాదికి ఈ ఏడాదికి ఉన్న తేడా ప్రజలకు, రైతులకు స్పష్టంగా తెలిసిందన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఎంత ఖర్చు అయినా వెరవకుండా విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని చెప్పారు. పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ అవసరాలకు ఈ ఏడాది ఎక్కడా విద్యుత్ కోతలు లేవని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున నీటి వినియోగం అధికంగా ఉండే పంటలు వేస్తే విద్యుత్ ఎక్కువ అవసరమవుతుందని గమనించి మొదటినుంచి రైతులకు అవగాహన కల్పించామన్నారు. మెట్ట పంటలు వేసుకోవాలన్న విజ్ఞప్తికి రైతులు సహకరించారన్నారు. ఇక నుంచి కరెంటు కోతలు ఉండవని హరీశ్‌రావు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. క్షమాపణ చెపుతామని వారు రాతపూర్వకంగా విజ్ఞాపన ఇవ్వాలని స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలోనే క్షమాపణ చెప్పడానికి వారికి అవకాశం ఇచ్చామన్నారు. విపక్షాలు వద్దు వద్దనే వరకు అసెంబ్లీని నిర్వహిస్తున్నప్పుడు సభను పొడిగించాల్సిన అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ బ్రహ్మాండంగా ఉందని, తక్కువ రోజుల్లో ఎక్కువ సమయం చర్చ జరిగిందని, ఎక్కువ పనిగంటలు ఈ అసెంబ్లీ నడిచిందని తెలిపారు.