విద్యుత్ కొరత తీరుస్తాం

-సీఎం కేసీఆర్‌తో చైనా సంస్థ డీఈసీ వెల్లడి
-660 నుంచి 1000 మెగా వాట్లకు ప్రతిపాదన

KCR-006

తెలంగాణలో విద్యుత్ కొరత సమస్య పరిష్కారానికి చైనా డాంగ్‌ఫ్యాంగ్ ఎలక్ట్రిక్ కార్పోరేషన్(డీఈసీ) ముందుకు వచ్చింది. 30 దేశాల్లో 100కు పైగా పవర్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న డీఈసీ తెలంగాణలోనూ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మంగళవారం సచివాలయంలో సీఎం కే చంద్రశేఖర్‌రావుతో డీఈసీ అంతర్జాతీయ అధ్యక్షుడు హ్యాన్‌జిఖాఓ, ఎండీ లియాంగ్ జియాన్, డీఈసీ ఇంటర్నేషనల్ చైనా థర్మల్ జనరల్ మేనేజర్ ఝాంగ్‌హంగ్, కంపెనీ ప్రతినిధులు ఝాంగ్ చెంగ్లి, ఎస్‌కే భన్ భేటీ అయ్యారు.

తెలంగాణలో అదనపు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు హామీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే సమర్ధవంతమైన విధానంతో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. సిచువాన్ ప్రువిన్స్ (చైనా) సహకారంతో తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపడతామని వారు హామీ ఇచ్చారు. పరస్పర సహకారంతో ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆర్ధిక సాయం అందించడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. తక్కువ సమయంలోనే 660 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయగలమన్నారు.

భారత్‌లోని పలు రాష్ర్టాలకు 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన పరికరాలు సరఫరా చేసినట్లు తెలిపారు. తెలంగాణతోనూ సత్సంబంధాలు కొనసాగాలన్నదే తమ ఆకాంక్ష అని డీఈసీ బృందం తెలిపింది.డీఈసీ పరికరాల తయారీ కేంద్రమైన చెగ్డూ ప్రాంతాన్ని సందర్శించాలని ఉందని కేసీఆర్ వారితో చెప్పారు. ఈ భేటీలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే జోషి, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.