విద్యుత్ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటాం

-తెలంగాణ రైతులను ముంచడానికే చంద్రబాబు కుట్రలు
-ప్రజలు ముఖ్యమో.. బాబో టీడీపీ టీ నేతలు తేల్చుకోవాలి
-ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుకోలు చేస్తాం
-భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు

Harish Rao

తెలంగాణ రైతులను ముంచడానికి, ప్రజలు చీకట్లో మగ్గాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుట్రలు పన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెదక్‌కు వచ్చిన ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డితో కలిసి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా, తెలంగాణ రెండూ సమానమని చెప్తూవచ్చిన చంద్రబాబు రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడానికి, వ్యవసాయానికి విద్యుత్ అందకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఈ విషయంపై తెలంగాణ టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

విభజన సమయంలో విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం చట్టం చేసిందని, ఈ చట్టాన్ని ధిక్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రద్దు నిర్ణయాన్ని తీసుకోవడంపై మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణలో వనరులున్న రామగుండం, భూపాలపల్లి, మణగూరు కేంద్రాలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యమా.. బాబు భజన చేయడం ముఖ్యమా? తేల్చుకోవాలని టీడీపీ టీ నేతలకు సూచించారు. వచ్చే పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకూ హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, ఇక్కడి శాసన సభ, డీజీపీ కార్యాలయం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ వద్దా అని ప్రశ్నించారు. ఉద్యోగులు, మంత్రుల కార్యాలయాలకు మంచినీళ్లు, విద్యుత్ అవసరం లేదా అని నిలదీశారు. చర్యకు ప్రతిచర్య అవసరం లేదని, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండికేస్తే తప్పదేమోనని హెచ్చరించారు. పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపి ఇప్పటికే 450 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే షీలేరును కోల్పోతున్నామని, తెలంగాణలో ఏర్పడే విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణం అవుతారని పేర్కొన్నారు. పీపీఏ రద్దు నిర్ణయంతో మరో 450 మెగావాట్ల విద్యుత్ నష్టపోవాల్సి వస్తుందన్నారు.

అయినా తెలంగాణ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు విద్యుత్ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మెదక్ జిల్లాలోనే ఏకైక మధ్య తరహా సాగునీటి వనరు ఘణపురం కాల్వలకు సంబంధించి రూ.25 కోట్లతో తలపెట్టిన సిమెంట్ లైనింగ్ పనులకు మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.కోటితో నిర్మితమైన మార్కెట్ కమిటీ గోదాంలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీలో నిర్మాణం కానున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్, మెదక్ ఆర్డీవో వనజాదేవి, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్‌రావు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.