విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచుతాం

-ఐటీ పరిశ్రమల సహకారం తీసుకుంటాం
ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్

KTR
– నగరంలోని అనేక ఐటీ పరిశ్రమల సహకారంతో ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వృత్తి పరమైన నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో వేలమంది కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నా, వారిలో పరిశ్రమకు అవసరమైన వృత్తి నైపుణ్యం కొరవడుతున్నదని ఐటీ సంస్థలు ఫిర్యాదు చేస్తుంటారన్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థులను పరిశ్రమకు అవసరమయ్యేలా తీర్చిదిద్దేందుకు నగరంలోని ప్రముఖ ఐటీ సంస్థలతో తాము సంప్రదింపులు జరిపి ఒక్కో సంస్థ వెయ్యి మంది ఇంజినీరింగ్ విద్యార్థులను మూడో సంవత్సరంలో దత్తత తీసుకొని వారికి అవసరమయ్యే శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. నగరాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి మరిన్ని లైఫ్‌ైస్టెల్ ఈవెంట్లను నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం వీసీ ఎస్ సత్యనారాయణ, సుల్తాన్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఖాన్ లతీఫ్ మహ్మద్‌ఖాన్, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, ముఫకంజా కళాశాల అధ్యక్షుడు ఆసిఫ్ అహ్మద్ పాల్గొన్నారు.