విద్యార్థులు సరికొత్త పరిశోధనలు చేయాలి

-ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్

KTR Addressing In BITSAT in Hyderabad

విద్యార్థులు అత్యాధునిక పద్ధతుల్లో నూతన ఆలోచనలతో పరిశోధనలు చేసి ప్రపంచంతో పోటీ పడాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో నిర్వహించిన అట్మోస్-2014 టెక్నికల్ ఫెస్ట్‌ను ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభిస్తూ పోటీ ప్రపంచంలో భారతదేశం టెక్నికల్ రంగంలో దినదినాభివృద్ధి సాధిస్తున్నదన్నారు. టెక్నికల్ బిజినెల్ ఇంక్యూబేటర్ క్యాంపస్‌కు బిట్స్ పిలానీ విద్యార్థుల సహకరించడమే వారి నైపుణ్యానికి నిదర్శనమన్నారు. తన చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో బిర్లా మందిరం, బిర్లా ప్లానిటోరియం చూసి ఎంతో మురిసిపోయేవాడినని, అలాంటి బిర్లా ఇన్‌స్టిట్యూట్‌కు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్‌రెడ్డి, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ వీఎస్ రావు, ఎంపీపీ బీ చంద్రశేఖర్‌యాదవ్, బిట్స్ పిలానీ క్యాంపస్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నిఖిల్ పొట్లురి, ప్రధాన కార్యదర్శి విష్ణుశరణ్, టెక్నికల్ కన్వీనర్ ముదిద్‌జైన్, విద్యార్థులు పాల్గొన్నారు. అట్మోస్ 2014 టెక్నికల్ పెస్ట్‌లో విజేతలకు మంత్రి కేటీఆర్ బహుమతులు ప్రదానం చేశారు.