వేగం పెంచిన కారు

-ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్
-హైదరాబాద్‌లో దేవీప్రసాద్ విస్తృత పర్యటన

Deviprasad-election-campaign

పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. రోజురోజుకూ వేగం పెంచుతున్న కారు పార్టీ శుక్రవారం మరింత స్పీడు పెంచింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన జీ దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు మద్దతునిచ్చేందుకు మరికొన్ని సంఘాలు ముందుకొచ్చాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్ శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. చార్మినార్, ఎల్బీనగర్, నాంపల్లి, ఆబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని ప్రధాన పార్కులలో వాకర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. కొత్తపేట, మలక్‌పేటలో సమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసి తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాల్సిందిగా కోరారు.

మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: తమ్మినేని వీరభద్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ అభ్యర్థిత్వంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉద్యోగ, కార్మిక ఉద్యమాలలో భాగస్వామ్యం వహించిన అవక్తిగా దేవీప్రసాద్‌పై తమకు గౌరవం ఉందని, అందుకే తాము ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలపలేదన్నారు. ఉద్యోగ, కార్మిక వర్గాల కోసం పోరాడే వ్యక్తిగా దేవీప్రసాద్‌కు సహకరిస్తామన్నారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ దేవీప్రసాద్ శుక్రవారం టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డితో కలిసి ఎంబీ భవన్‌లో తమ్మినేనిని కలిశారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తామన్నారు. ఈ నెల10వ తేదీన రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశముందని, ఆ సమావేశంలో చర్చించిన తరువాత ఇతర వామపక్ష పార్టీలతోనూ మాట్లాడి.. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

టీఎస్ ఎంపీడీవోలు, టీఐటీఏ మద్దతు
శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీచేస్తున్న జీ దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు తెలంగాణ రాష్ట్ర ఎంపీడీవోల సంఘం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ)లు మద్దతు ప్రకటించాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న దేవీప్రసాద్ ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ పోరాటంలో కీలకమైన పాత్ర పోషించారని వారు ఈ సందర్భంగా కొనియాడారు. పల్లా రాజేశ్వరరెడ్డి సైతం తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ఎస్ తరఫున పోరాటంలో ప్రముఖ భూమిక పోషించారని పేర్కొన్నారు. టీఐటీఏ నాయకులు దేవీప్రసాద్‌ను శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీఐటీఏ అధ్యక్షుడు సందీప్ మక్తల మాట్లాడుతూ.. దేవీప్రసాద్‌కు మద్దతుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. దేవీప్రసాద్‌ను కలిసినవారిలో టీఐటీఏ నేతలు నవీన్ గడ్డం, రాణాప్రతాప్, విష్ణుమూర్తి కాలగోని, రవి ఆంథోనీ, స్వామి దేవ, ఎండీ మన్సూర్, నవీన్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ లోక్‌సత్తా మద్దతు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు జీ దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు తెలంగాణ లోక్‌సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నారం నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తమ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్ చేసిన పోరాటాలను గుర్తించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో తమ పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని పార్టీలు తమకు తెలంగాణ లోక్‌సత్తా మద్దతు ఉందని చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమన్నారు.