వచ్చే ఖరీఫ్‌లో 9గంటల పగలు కరెంటు

-పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటలు
-డిస్కమ్‌లకు యాదాద్రి, శ్రీరాజరాజేశ్వరిగా పేర్లు
-విద్యుత్ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

KCR review meet on Power supply

వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటలు నిరంతర కరెంటు సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ అంచనాలు పారదర్శకంగా, వాస్తవంగా ఉండాలని నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో తొమ్మిది గంటల విద్యుత్ అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే కోతలు లేకుండా కరెంటు సరఫరా అందించినందుకు అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లన్నింటికీ తొమ్మిది గంటల కరెంటు సరఫరాను అందించడం వల్ల ఎన్ని మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నెలకొంటుందో ఖచ్చితమైన అంచనాలు వేయాలని సూచించారు. ఆగస్టులో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది కనుక అవసరమైతే పరిశ్రమలకు ఒకరోజు నిలిపివేసి అంచనాలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ అవసరాలకు రెండు మూడు విడతలుగా, అదీకూడా రాత్రిపూట విద్యుత్ సరఫరా చేయడం రైతులకు ఇబ్బందిగా ఉందన్నారు.
వ్యవసాయానికి విద్యుత్‌సరఫరా తీరుతెన్నులను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వచ్చేఏడాది నుంచి పగటిపూట తొమ్మిది గంటల పంటలకు కరెంటు సరఫరాకు అనుగుణంగా ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను రెండు భాగాలుగా చేసి తొలుత వ్యవసాయ ఫీడర్లకు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, రెండో భాగం వ్యవసాయ ఫీడర్లకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కరెంటు సరఫరాను అందిస్తామని చెప్పారు. ఇందుకు విద్యుత్ పంపిణీ(ట్రాన్స్‌మిషన్), సరఫరా(డిస్ట్రిబ్యూషన్) వ్యవస్థలను మరింత పటిష్ఠ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వచ్చే మార్చి నుంచి అదనంగా మూడు వేల మెగావాట్ల విద్యుత్తు రాష్ట అవసరాలకు అందుబాటులోకి వస్తుందన్నారు. వచ్చే ఏడాదినాటికల్లా సాగుకు పగలు తొమ్మిది గంటలు, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మౌలికసదుపాయాలతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టాలని సీఎం సూచించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని, మంజూరయ్యాక సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.

డిస్కమ్‌ల పేర్లు మార్పు: విద్యుత్ సమీక్ష సందర్భంగా డిస్కమ్‌ల పేర్ల మార్పును సీఎం ఖరారు చేశారు. వరంగల్ కేంద్రంగా ఉన్న నార్తర్న్ పవర్ డిస్కమ్ (ఎన్పీడీసీఎల్)కు శ్రీ రాజరాజేశ్వరి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఆర్‌ఆర్‌పీడీసీఎల్)గా, హైదరాబాద్‌లోని సదరన్ పవర్ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్) పేరును యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(వైఎల్‌ఎన్‌ఎస్‌పీడీసీఎల్)గా మార్పుచేశారు. సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, డిస్కమ్‌ల సీఎండీలు కే వెంకటనారాయణ, జీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్(ట్రాన్స్‌మిషన్) టీ జగత్‌రెడ్డి, యాదాద్రి డిస్కమ్ డైరెక్టర్(ఆపరేషన్) జే శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్(ఫైనాన్స్) సీ శ్రీనివాసరావు, శ్రీ రాజరాజేశ్వరి డిస్కమ్ డైరెక్టర్(ప్రాజెక్ట్స్) బీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం పారిశ్రామిక స్వర్ణయుగం వైపు పురోగమనం ప్రారంభించిందని, అందుకు ఈ కార్యక్రమంతో నాంది పలుకుతున్నామని ముఖ్యమంత్రి ఆనందోత్సాహల మధ్య ప్రకటించారు. యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు రాష్ర్టాన్ని ఆర్థికంగా పటిష్ఠపరిచే లక్ష్యంతో సింగిల్ విండో పారిశ్రామిక విధానం తెచ్చామని కేసీఆర్ చెప్పారు. ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని, ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఆయన పునరుద్ఘాటించారు. పరిశ్రమలకు కావాల్సిన భూమి, నీరు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తూ, అనుమతులను కూడా సరళతరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.