వచ్చే ఏడాది 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు

-ఆడబిడ్డలకు కానుకగా ఇవ్వాలని సీం కేసీఆర్ ఆదేశించారు
-జీపీఎస్, బయోమెట్రిక్‌తో బియ్యం అక్రమ రవాణాకు చెక్
-ఆదాయానికి ఢోకా లేదు..
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి ఈటల రాజేందర్

Eetela Rajendar

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డలకు 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రెండ్రోజులుగా కరీంనగర్ జిల్లాలో స్వైన్‌ఫ్లూపై యంత్రాగాన్ని అప్రమత్తం చేస్తూ పర్యటిస్తున్న మంత్రి శుక్రవారం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు.

నమస్తే తెలంగాణ:
మహిళలు గ్యాస్ కనెక్షన్లు కావాలంటున్నారు. ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి?
మంత్రి: తెలంగాణ సాధనలో మహిళల పాత్ర మరువలేనిది. ఆడబిడ్డలందరికీ కానుక ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 10వేల చొప్పున 12 లక్షల గ్యాస్‌కనెక్షన్లను ఇవ్వాలని ఆదేశించారు. గతంలో దీపం పథకం మాదిరిగా సబ్సిడీ వర్తిస్తుంది.

రేషన్ బియ్యం రవాణాలో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు జీపీఎస్ విధానం అమలుచేస్తామన్నారు. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.?
పౌరసరఫరాలశాఖ ప్రక్షాళనకు అనేక చర్యలు చేపట్టాం. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణాకాకుండా ఉండేందుకు జీపీఎస్ అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. గతంలో కుటుంబాలకు మించి రేషన్‌కార్డులుండటంతో బియ్యం కోటా ఎక్కువగా డ్రా చేసి బ్లాక్‌మార్కెట్‌కు విక్రయించారు. ఆరోగ్యశ్రీని తెల్లకార్డుతో అనుసంధానం చేయడమే బియ్యం పక్కదారి పట్టడానికి కారణమైంది. అందుకే ఆహారభద్రత కార్డులను బియ్యం కోసమే వినియోగిస్తున్నాం. అర్హుడైన కార్డుదారులే వెళ్తే తప్ప బియ్యం తీసుకోవడానికి వీల్లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తాం.

త్వరలో అంగన్‌వాడీకేంద్రాల్లోనూ సన్నబియ్యం అమలుచేస్తామన్నారు. సన్నబియ్యం కొరతతో, ఇది మూన్నాళ్ల ముచ్చటేన్న విమర్శలపై మీ సమాధానం?
గిట్టనివాళ్లు విమర్శలవి. సాధ్యం కాదంటున్న మాట వాస్తవమే, కానీ అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేయడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. గతంలో ఎన్నోచేశాం. ఇదీ చేస్తాం. మా అంచనా ప్రకారం ఏడాదికి 2 లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యం అవసరం. ఇప్పటికే ఆ మేరకు సేకరించి పెట్టాం. ఈ విద్యాసంవత్సరం మొత్తానికి పాత సన్నబియ్యాన్నే ఇస్తాం. వచ్చేఏడాదికి ముందుగా సేకరిస్తాం. గతంలో రేషన్‌కార్డులపై 14 లక్షల మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. ఆరు కిలలోలకు పెంచడంతో 21 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అదనమైనప్పటికీ భారంగా భావించడంలేదు.

సన్నబియ్యం వల్ల పిల్లలు ఎక్కువగా తింటారని, కోటా సరిపోవడంలేదనే డిమాండ్లపై ఏమంటారు?
నిజమే. ఈ విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా చూస్తోంది. ప్రతి మండలంలోని ఒక పాఠశాలను నెలరోజులపాటు పరిశీలన చేయాలని చెప్పాం. గతంలో వినియోగమైన బియ్యం ఎంత? ప్రస్తుతం ఎంత? అనే వివరాలు తీయాలని చెప్పాం. వాటి ఆధారంగా అవసరాన్ని బట్టి ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటా పెంచుతాం.

రేషన్ డీలర్లు చాలాకాలంగా కమీషన్ పెంచాలంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?
రేషన్‌డీలర్లు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. పౌరసరఫరాల ప్రక్షాళనసాగే సమయంలోనే వారికి కడుపునిండేలా కమీషన్ ఇవ్వాలన్న అలోచన ఉన్నది.

తొలిబడ్జెట్‌కు అనుగుణంగా ఆదాయం లేదని, ఇబ్బందులు తప్పవని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ కోణంలో చూస్తారు? ఆదాయం పెంపునకు మార్గాలేమిటి?
రాష్ట్రంలో తొలిబడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి ఏశాఖ నుంచి ఎంత ఆదాయం వస్తుంది? అదాయ స్థిరత్వం, వ్యయాలు ఎలా ఉంటాయన్న అంచనాల్లేవు. ఏ బడ్జెటయినా అంచనాలకు కొంత అటూ ఇటూగా ఉంటుంది. మన బడ్జెట్ కూడా అంతే. పత్రికల్లో కథనాలు వచ్చినట్లుగా భయపడే పరిస్థితులు లేవు. నిధులకు ఢోకాలేదు. ప్రస్తుత బడ్జెట్‌కు మించిన బడ్జెట్‌ను వచ్చే అర్థిక సంవత్సరంలో చూస్తాం. ఇప్పటికే పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి.. అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. పన్ను ఏగవేతదారులను గుర్తించి చర్యలు చేపడుతున్నాం. వ్యాపార అభివృద్ధికి బాటలు వేస్తున్నాం.