వచ్చే బడ్జెట్‌లో మెగా టెక్స్‌టైల్స్ క్లస్టర్

-సిరిసిల్లలో అపెరల్ పార్క్ ఏర్పాటుకు కృషి
-అన్ని యూనిట్లకూ రాష్ట్ర ప్రభుత్వ రాయితీ
-పంచాయతీరాజ్ శాఖా మంత్రి కేటీఆర్

KTR 01

వచ్చే బడ్జెట్ లో సిరిసిల్లలో మెగాటెక్స్‌టైల్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మండలం సారంపల్లి టెక్స్‌టైల్స్ పార్కులో సోమవారం ఇన్వెస్టర్లు, చేనేత జౌళీశాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిరిసిల్లలో మరనేతన్నల ఆకలిచావులు, ఆత్మహత్యల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు మెగాటెక్స్‌టైల్స్ క్లస్టర్ ఏర్పాటే శరణ్యమన్నారు. అలాగే కార్మికులతో పాటు యజమానులకు ఉపాధి క ల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిరిసిల్లలో ఆపెరల్ పార్కు ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈపార్కు ద్వారా ఒక్కొ యూనిట్‌కు రూ.4కోట్ల మేర కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉందన్నా రు. పార్కులో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

పవర్‌హాలిడే నుంచి మినహాయింపు..
రాష్ట్రంలో కరెంటు కోతలున్న మాట వాస్తవమని, పార్కు అభివృద్ధ్దిని కాంక్షిస్తూ పవర్‌హాలిడే నుండి పార్కును మినహాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే మరో 15ఎకరాల్లో పార్కును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్కులో యూనిట్లు స్థాపించని యజమానులకు నోటీసులు జారీ చేసి స్థలాలను రద్దు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. రాష్ట్రం నుంచి వచ్చే రాయితీలను అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పార్కులో త్రిజీ సేవలు..
పార్కులో ఇన్వెస్టర్లకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో బీఎస్‌ఎన్‌ఎల్ త్రిజీ సేవలు కూడ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పార్కుతో పాటు సిరిసిల్ల మండలం చుట్టూ ఉన్న మరమగ్గాలను క్లస్టర్ పరిధిలో తీసుకువచ్చి అన్ని రాయితీలు అమలయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ పార్కులో అన్ని హంగులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సవ్యసాచిఘోష్, డైరెక్టర్ నర్సింగరావు, ఆర్‌డీడీ రమణమూర్తి, ఏడీ రఘురాం భూపాల్, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, డీఓ అశోక్‌రావు టీఆర్‌ఎస్ నాయకులు చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్, జిం దం చక్రపాణీ, అగ్గిరాములు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు కేంద్రాలు…
సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ నివాసంలో సోమవారం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించారు. నార్కట్‌పల్లెకు చెందిన రేణుక అనే మహిళ తనకు నివాస స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్న మొట్టమొదటి ఫిర్యాదుకు మంత్రి, ఎంపీలు స్పందించారు. అక్కడే ఉన్న తహసీల్దార్, ఆర్డీఓలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్‌లు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌కు రావడం ఖర్చులతో పాటు సమయం వృధా అవుతున్నందున ఐటీ టెక్నాలజిని సద్వినీయోగం చేసుకుంటూ ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ మంత్రిని అభినందించారు. బాధితుల ఫిర్యాదులు రిజిస్టర్ చేసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబరు కూడ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చీటి నర్సింగరావు, పురపాలక సంఘం అ ధ్యక్షురాలు సామల పావని, ఉపాధ్యక్షుడు తవుటు కనుకయ్య, బొల్లి రాంమోహన్, జడ్పీటీసీలు తోట ఆగయ్య, పూర్మాణి మంజుల పాల్గొన్నారు.