ఉపాధి హామీ పథకం ప్రజల హక్కు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పేద ప్రజల హక్కు అని, ఉపాధి పథకం నిర్విఘ్నంగా కొనసాగేలా జిల్లా కలెక్టర్లు, మండలాభివృద్ధి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలోని సీ-బ్లాక్‌లో బుధవారం కలెక్టర్లతో ఉపాధిహామీ పథకంపై ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉపాధిహామీ పథకం పనులు జరుగుతున్న తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

KTR-review-on-Upadhi-haami-scheme

-యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించండి
-జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఉపాధి హామీ పథకం బాగా వెనుకబడటం అవమానకరంగా ఉందని పేర్కొన్నారు. కనీసం జాతీయ ప్రమాణాల స్థాయిలో ప్రమాణాలు సాధించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభించాలని, లేకుంటే శ్రమశక్తి సంఘాల ఉపాధికి తాము ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18002001001కు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.

ఉపాధి హామీ పథకంలో బాగా పనిచేస్తున్న ఐకేపీ కేంద్రాలకు గోడౌన్లు, డ్రైయింగ్ ఫాం నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వ స్థలం లేని చోట జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు స్థలం సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కేంద్రం ఉపాధి హామీ పథకంపై పరిమితులు విధిస్తుందన్న నేపథ్యంలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు.

కేరళలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల గ్రామీణాభివృద్ధి మంత్రుల సమావేశంలో ఉపాధి హామీ పథకం కొనసాగించాలని తాను పట్టుపట్టానని, ఇలాంటి నేపథ్యంలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు సూచించారు. పలు జిల్లాల్లో ఉపాధి పథకం నిర్వహణ సరిగాలేదని మంత్రి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సరైన ప్రణాళికలతో ముందుకు రావాలని కలెక్టర్లకి ఆదేశాలిచ్చారు. ఎంపీడీవోలను ఉపాధిహామీ పథకం ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమించినా, ఇప్పటివరకు ఆ బాధ్యతలు పూర్తిగా స్వీకరించినట్టు కనిపించడం లేదని అన్నారు.

ఎంపీడీవోలతో వారానికోసారి సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్ పర్యటించాలని, ప్రతి జిల్లా నుంచి సమర్ధవంతంగా ఉపాధిహామీ పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరువు ఛాయాలు నెలకొన్నందున ఉపాధిహామీ పథకం పనులు పేదలకి ఉపశమనం కల్పిస్తాయని, 100 రోజుల ఉపాధిహామీ పథకం లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన మార్గదర్శకాల అమలులో భాగంగా బయోమెట్రిక్ విధానంలో కూలీల నమోదు, మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైన అంశాలను తప్పక చేపట్టాలని మంత్రి సూచించారు. ఉపాధిహామీ పథకంలో అవినీతి చోటుచేసుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు రేమండ్‌పీటర్, అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో ఏ మురళి పాల్గొన్నారు.