ఉద్యోగులు భక్తితో పని చేయాలి

-తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం
-కొత్త ఏడాది నుంచి హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ
-టీఆర్‌ఎస్‌ది చేతల ప్రభుత్వం: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

Etela Rajendar

ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేసి మన్నలను పొందారని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నిర్మించిన టీఎన్జీవో భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులు భయంతో కాదు.. భక్తితో పనిచేసి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు.

జనవరి 1 నుంచి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో సంతృప్తికరమైన భోజనం పెట్టేందుకు శ్రీకారం చుడుతామన్నారు. గతంలో హాస్టల్ విద్యార్థులు ఉడికీఉడకని అన్నం తిని అనారోగ్యం పాలయ్యేవారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు సన్నబియ్యం పంపిణీ చేయాలని సూచించారని తెలిపారు.

తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టంచేశారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు రూ.17 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, ప్రత్యేక రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను అభివృద్ధికి కేటాయించామన్నారు.రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తానని మాట ఇచ్చారని, ఆ దిశగా జిల్లాల పునర్విభజనలో తప్పకుండా వికారాబాద్ జిల్లా కావడం ఖాయమన్నారు. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఈటల ఈటెల్లాంటి మాటలు విసిరి ఉద్యమకారులను ప్రోత్సహించేవారని, ప్రస్తుతం మాటలకు బదులు మూటలు విసిరి తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని చమత్కరించారు.

టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. వికారాబాద్‌లో ఐటీ రంగ సంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, యాదయ్య, జిల్లా కలెక్టర్ శ్రీధర్, వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారెం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.