ఉద్యోగులను సృష్టించేలా ఇంజినీరింగ్ విద్య

రాష్ట్రంలో ఇంజినీరింగ్ పట్టభద్రులను కాకుండా ఇంజినీరింగ్ ఉద్యోగులను సృష్టించేందుకు కృషి చేస్తున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో ఇంజినీర్ కావడం చాలా సులభంగా మారిందని, కానీ రాసికన్నా వాసి ముఖ్యమని తాము బలంగా నమ్ముతున్నామని తెలిపారు. అందుకే వృత్తివిద్య విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

KTR

-వృత్తివిద్యలో రాసికన్నా వాసి ముఖ్యం
-15000 మంది విద్యార్థుల శిక్షణ కోసం పైలట్ ప్రాజెక్టు
-మంత్రి కేటీఆర్ సమక్షంలో నాస్కాం-జేఎన్టీయూలతో టాస్క్ ఎంఓయూ

ప్రభుత్వం ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థ.. నాస్కాం సంస్థ, జేఎన్టీయూలతో కేటీఆర్ సమక్షంలో మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొద్దికాలం క్రితం ఐటీ, నాస్కాం ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సీఎం అప్పుడే నిర్దేశించారు. అందుకు అనుగుణంగా రూపొందించినదే ఈ శిక్షణా, కెరీర్ గైడ్స్ విధానం.

సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్‌లో 15,000మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. అందుకోసం టాస్క్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటుచేశాం. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న ఈ మొదటి అడుగులో జేఎన్టీయూ, నాస్కాం, టాస్క్‌లు విజయవంతంగా పూర్తిచేస్తాయనే విశ్వాసం ఉంది అన్నారు. ఈ శిక్షణకు నాస్కాం ఫీజు వసూలు చేయకపోవడం సంతోషకరమన్నారు. తమ ప్రభుత్వం నాణ్యతలేని ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకుంటే కూడా విమర్శించారని, అయితే ప్రమాణాలకోసమే అలా వ్యవహరించామని మంత్రి స్పష్టంచేశారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, నాస్కాం వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజా రామయ్యార్, రిజిస్ట్రార్ రమణారావు, రెక్టార్ కిషన్, టాస్క్ ప్రతినిధి సుజీవ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు.