ఉద్యోగులకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

-వచ్చే బడ్జెట్‌లో సెర్ప్ ఉద్యోగులకు డీఏ, ప్రత్యేక వేతనం, ఇంక్రిమెంట్
-సెర్ప్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

KTR-01

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని.. కొద్దిగా ఓపిక పట్టాలని రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. సెర్ప్ ఉద్యోగులకు వర్తింపజేయాల్సిన ఆర్థికపరమైన డిమాండ్లు ఈ బడ్జెట్‌లో సాధ్యం కాదని, వచ్చే ఆర్ధిక బడ్జెట్‌లో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏప్రిల్ తర్వాత డీఏ, ప్రత్యేక వేతనం, ఇంక్రిమెంట్, ఆరోగ్య బీమా తదితర డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సెర్ప్ ఉద్యోగుల సంఘం ఐదో వార్షికోవత్సం సందర్భంగా నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన బంగారు తెలంగాణ నిర్మాణంలో సెర్ప్ ఉద్యోగుల పాత్ర అంశంపై సదస్సు, 2015 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశాన్ని జీవో 22 ద్వారా ఏర్పాటుచేసిన ఉన్నతాధికారుల కమిటీ పరిశీలిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా రోస్టర్ పద్ధతిలో నియామకమైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్వీస్ క్రమబద్దీకరణలో తప్పక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వాలు మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేసేవని, ఆ ఉపసంఘం ఇచ్చిన నివేదికను ఐఏఎస్ అధికారులు నిబంధనల పేరుతో అడ్డుకునేవారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటి సమస్యలు ఉత్పన్నం కావొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ జీవో 22తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ ఇప్పటికే వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరించే పనిలో ఉందని చెప్పారు.

బంగారు తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగంగా ఒక్కో ఉద్యోగి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న సెర్ప్ ఉద్యోగుల సంఘం ఆలోచన అభినందనీయమన్నారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాదరావు మాట్లాడుతూ ఉద్యోగుల క్రమబద్దీకరణకు చిత్తశుద్ధితో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సెర్ప్ ఉద్యోగుల సంఘం సభ్యులు మంత్రి కేటీఆర్, జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ఉపాధ్యక్షురాలు రేచల్, ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి, నగరశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సెర్ప్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాధర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సుదర్శన్, కోశాధికారి వెంకట్, ఉపాధ్యక్షురాలు సరస్వతి, సంయుక్త కార్యదర్శి కృష్ణ, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అనిల్, టీసీవో రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ పాల్గొన్నారు.