ఉద్యోగ భర్తీని భారీగా చేపడుతాం

-సిబ్బంది విభజన కొలిక్కి రానందునే సమస్యలు
-విద్యార్థుల అందోళనను పరిగణనలోకి తీసుకుంటాం
-ఈ విషయంపై సీఎం కేసీఆర్‌కు అవగాహన ఉన్నది
-శాసనమండలిలో మంత్రి కేటీఆర్

KTR

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అశాంతి, ఆందోళనను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపట్టేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. పరిపాలనాపరంగా ఉన్న కొన్ని సాంకేతిక ఇబ్బందులతోనే నియామక ప్రక్రియ ఆలస్యమవుతున్నదని, అయినా త్వరలోనే నియామక ప్రక్రియలను చేపడుతామని పేర్కొన్నారు. ఖాళీపోస్టుల సంఖ్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగ భర్తీ పై నిర్ణయం ఆలస్యమవుతున్నదని వివరించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో అశాంతి ఉన్న మాట నిజమేనని, ఓయూలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థుల అశాంతిపై, తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు నిర్వహించిన భూమికపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు స్పష్టమైన అవగాహన ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం శాసనమండలిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళన అంశంపై చర్చ జరిగింది. సభ్యులు నాగేశ్వర్, ధర్మపురి శ్రీనివాస్, పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, ఫారూక్‌హుస్సేన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ విద్యార్థుల ఆందోళనను తగ్గించేందుకు, ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు.

ఐఏఎస్‌ల విభజనకోసం ఏర్పాటుచేసిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ, ఉద్యోగుల విభజన కోసం ఏర్పరిచిన కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేయకపోవడం, వివిధశాఖల్లో ఖాళీల సంఖ్య ఓ కొలిక్కి రాకపోవడం వంటి కారణాలతోనే ఉద్యోగ భర్తీ కొద్దిగా ఆలస్యమవుతున్నదన్నారు. శాఖాపరంగా అన్ని విభాగాల్లో ఈ విషయంపై కసరత్తు జరుగుతున్నదని, ఇప్పటికే పంచాయతీరాజ్‌శాఖలో లెక్కలు సిద్ధం చేశామని, గ్రామీణ నీటిపారుదలశాఖలో 700పైగా ఖాళీలు భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు డిగ్రీలు తీసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. ఉద్యోగాల నియామకాల విషయంలో స్పష్టత ఉన్నందునే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పరచామని వివరించారు.

మరోవైపు సాఫ్ట్‌వేర్ రంగంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగావకాశాలు పెంచే పద్ధతులపై విధాన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సభ్యుల ఆందోళనలు, విద్యార్థి యువకుల ఆశాంతితో ప్రభుత్వం ఏకీభవిస్తున్నదని తెలిపారు. ఎవరిగొంతు నొక్కేందుకు తాము ప్రయత్నించడం లేదని, తామే చర్చలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులను విభజన ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని, కేంద్రం చేస్తున్న ఆలస్యాన్ని గమనించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.