ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇటీవల కొండా లక్ష్మణ్ విగ్రహావిష్కరణ సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక విద్యాసంస్థకు కొండా పేరును పెడతామని ప్రకటించారు. ఈ మేరకు ఉద్యానవన యూనివర్సిటీకి ఆయన పేరును ఖరారుచేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటనను విడుదలచేసింది.

Konda-Laxman-01

సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలు
ఉద్యానవన విశ్వవిద్యాలయానికి వెనుకబడిన వర్గానికి చెందిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం హర్షణీయమని, ఇందుకు గానూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సీఎం నిర్ణయాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై హ్యాం డ్లూం ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ యర్రమాద వెంకన్న నేత, నేషనల్ హ్యాండ్లూం బోర్డు మెంబర్ తడ్క యాదగిరి, ఆప్కో డైరెక్టర్లు మంత్రి బాబు, గడ్డం జగన్నాథం, చేనేత వర్గాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిక్కా దేవదాస్, తదితరులు హర్షం వ్యక్తంచేశారు.