ఉద్యాన వర్సిటీ పనులు ప్రారంభించండి..

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఉద్యానవన విశ్వవిద్యాలయం (హార్టికల్చర్ యూనివర్సిటీ) ఏర్పాటు పనులు త్వరగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. హార్టికల్చర్ యూనివర్సిటీతోపాటు గజ్వేల్‌లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, గజ్వేల్ నియజకవర్గం ప్రత్యేక అధికారి హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీకి 4.92 హెక్టార్ల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

KCR review meet on Gajwel development authority

-4.922 హెక్టార్ల స్థలం కేటాయింపుపై ఉత్తర్వులు
-గజ్వేల్‌లో ఎడ్యుకేషన్ హబ్ డిజైన్ల ఆమోదం
-క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
గజ్వేల్ పట్టణంలో బాలురు, బాలికల కోసం ఏర్పాటు చేయనున్న వేర్వేరు ఎడ్యుకేషన్ హబ్‌ల డిజైన్లను, ఆడిటోరియం, హౌసింగ్ కాలనీల లేఅవుట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి వాటిని ఆమోదించారు. పట్టణంలో 45 ఎకరాల విస్తీర్ణంలో 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు బాలుర కోసం ఒక ఎడ్యుకేషన్ హబ్‌ను, అలాగే 20 ఎకరాల విస్తీర్ణంలో 6 నుంచి డిగ్రీ వరకు మరొక ఎడ్యుకేషన్ హబ్‌ను నిర్మించనున్నారు. పట్టణంలోని దాదాపు రెండువేల కుటుంబాల కోసం గృహ సముదాయాలను నిర్మించనున్నారు. ఒకటి 1200 మంది, మరొకటి 500 మంది సామర్థ్యంతో రెండు ఆడిటోరియాలతో కూడిన మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలును నిర్మించనున్నారు. డిజైన్లు, లేఅవుట్లు ఆమోదం పొందినందున అంచనాలు రూపొందించి టెండర్లు పిలవాలని, పనులుకూడా త్వరతిగతిన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

క్రిస్టియన్ భవన్ డిజైన్‌కు ఆమోదం..
హైదరాబాద్ నగరంలోని మారేడ్‌పల్లిలో నిర్మించతలపెట్టిన క్రిస్టియన్ భవన్ నమూనాను, లేఅవుట్‌ను సీఎం కేసీఆర్ ఆమోదించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్‌లో ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, పచ్చికబయళ్లు ఉండే విధంగా డిజైన్‌ను రూపొందించారు.