ఉద్యమించింది టీఆర్‌ఎస్సే

– ఉద్యమ సమయంలో ఏసీ గదుల్లో కాంగ్రెస్ మంత్రులు
– టీఆర్‌ఎస్ ఉద్యమం, బలిదానాల్లేకుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేదా?
– తెలంగాణలో టీడీపీ నూకలు చెల్లు..ఓటేస్తే మురిగిపోయినట్లే
-మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు

harish Rao campaign at Medak 29-Mar-14

తెలంగాణ కోసం ఉద్యమించింది టీఆర్‌ఎస్ పార్టీయేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడూ ఉద్యమం చేయలేదని, ఉద్యమాలు చేసింది టీఆర్‌ఎస్, జేఏసీ, తెలంగాణ ప్రజలేనని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు అనుభవిస్తూ ఏసీ గదులను వదల్లేదని విమర్శించారు. శుక్రవారం మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలో ప్రసంగించారు.

తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమం సమయంలో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఉద్యమకారులపై కేసులు పెట్టించింది కాంగ్రెస్ నాయకులన్న విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. టీఆర్‌ఎస్ ఉద్యమం, ఆత్మబలిదానాలు లేకుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేదా అని ప్రశ్నించారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా ఉద్యమ కేసులు లేవని, తాము జైలుకెళ్లామని గుర్తుచేశారు. ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడ వద్దని కేసీఆర్ చెబుతుంటే, బాబు, పొన్నాల మాత్రం ఇక్కడే ఉండాలంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రా ఉద్యోగులు వెళ్లాల్సిందేనన్నారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయని, ఆపార్టీకి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనన్నారు. రోడ్‌షోలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1న జోగిపేటలో కేసీఆర్ బహిరంగసభ
-సభాస్థలంలో ఏర్పాట్లు పరిశీలించిన హరీశ్‌రావు
జోగిపేట: జోగిపేటలో ఏప్రిల్ 1న తలపెట్టిన బహిరంగసభకు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. ఈ సభలో ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పశ్చిమ మెదక్ పరిధిలోని అందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ నుంచి కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. జోగిపేట నుంచి డాకూర్ వైపు దారిలోని వ్యవసాయ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న సభావేదిక, ప్రాంగణం పనులను ఆయన పరిశీలించారు.హెలిప్యాడ్ ఎక్కడ దిగాలో నాయకులకు సూచించారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.