ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం

-అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం
-పోలీసులను ప్రజా పోలీసుగా మార్చుతాం
-సింగరేణిలో కొత్త గనులతో 50వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం
-హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

Naini Narsimha Reddy
తెలంగాణ ఉద్యమకారులపై కేసులను త్వరలోనే ఎత్తివేస్తామని, 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరువీరుల కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, గోదావరిఖనిలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రజలందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం వచ్చిందని, అమరుల కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. కుటుంబంలో అర్హులైన వారు ఉంటే ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సహాయం, ఇంటి స్థలం, మూడెకరాల భూమి ఇస్తామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలు త్వరలోనే 24 జిల్లాలుగా ఏర్పాటు అవుతాయని, అందులో మంచిర్యాల జిల్లాగా ఉంటుందన్నారు. మంచిర్యాలలో మహిళ పోలీస్‌స్టేషన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

శ్రీరాంపూర్‌లోని మహిళ పోలీస్‌స్టేషన్‌ను పునరుద్దరిస్తామన్నారు. దళితులు, మైనార్టీలు, గిరిజనుల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలన్న సంకల్పంతో ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయనున్నారని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లితే కొడతారని, తిడుతారని, అక్రమ కేసులు పెడతారనే అభిప్రాయం ఉందని, వీటిని దూరం చేస్తూ తెలంగాణ పోలీసును ప్రజాపోలీసుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలీస్ శాఖలో సమూలంగా మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

ఇందులో భాగంగా పోలీస్‌లకు వారానికి ఒక్క రోజు సెలవుతోపాటు ట్రాఫిక్ పోలీసులకు 30శాతం జీతం పెంచడం, వారికి ఆధునిక మాస్క్‌లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో పెను మార్పులు తీసుకురావడానికి రూ.300 కోట్ల నిధులు ముఖ్యమంత్రి కేటాయించారని తెలిపారు. నేరం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేలా 1650 ఇన్నోవా వాహనాలు, 1700 బైక్‌లు కొనుగోలు చేస్తున్నామని, వాహనాల్లో 2జీ, 4జీ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

తీవ్రవాదుల కార్యకలాపాలతోపాటు హైదరాబాద్‌లో నేరాల సంఖ్యను తగ్గించడానికి 3వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి సంస్థలో కొత్త బొగ్గు గనులు తవ్వడం ద్వారా కొత్తగా 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇతర సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, నల్లాల ఓదెలు, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, వెంకట్రావ్ తదితరులు ఉన్నారు.