ఉద్యమం స్ఫూర్తితో బంగారు తెలంగాణను సాధిస్తాం

-చేనేత రంగాన్ని ఆదుకొంటాం: జూపల్లి కృష్ణారావు
-పరిశ్రమలు, జౌళిశాఖ మంత్రిగా బాధ్యతల స్వీకారం
శాంతియుత ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించాం. అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సచివాలయంలో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత రంగాన్ని ఆదుకొంటామని, భారీ కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. తెలంగాణలో అనేక సహజ వనరులు, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వివక్ష మూలంగానే ఇంతకాలం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

Jupally-Krishna-Rao-Resumes-his-office

జాతీయ, అంతర్జాతీయ డిమాండ్లకు తగ్గట్లుగా ఉత్పాదక పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ మహిళలను ఆర్థికాభివృద్ధి దిశలో అడుగులు వేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత వస్ర్తాలను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసినప్పుడే ఆ రంగానికి పూర్వ వైభవం వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేనేత వస్ర్తాలను కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తామన్నారు.

చెరుకు రైతులకు ప్రయోజనకరంగా ఉండే చక్కెర కర్మాగారాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి జూపల్లికి రెవెన్యూ శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే జోషి తదితరులు అభినందనలు తెలిపారు.

-చేనేత, జౌళి శాఖకు రూ.44 లక్షల విడుదల
రాష్ట్ర చేనేత, జౌళి శాఖకు రూ.43.99 లక్షలు విడుదల చేస్తూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూపల్లి కృష్ణారావు ఫైలుపై తొలి సంతకం చేశారు. గురువారం సచివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత నిధుల విడుదల ఫైలుపై సంతకం చేసినట్లు పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ, ఆప్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వీ సైదా టీ మీడియాకు తెలిపారు.

మెదక్ జిల్లా హనుమంతరావుపేటలోని మార్కండేయ హ్యాండ్లూం కో ఆపరేటివ్ సొసైటీకి కామన్ వర్క్‌షెడ్‌ను నిర్మించేందుకు రూ.8 లక్షలు, దుబ్బాకలో అదనపు వర్క్‌షెడ్ నిర్మాణానికి రూ.23 లక్షలు, జోగిపేటలో డై హౌజ్‌ను నిర్మాణానికి రూ.7.99 లక్షలు, నల్లగొండ జిల్లా మునుగోడులో పాత సొసైటీ భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు విడుదల చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను కూడా రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి సభ్యసాచి ఘోష్ జారీ చేశారు.