ఉద్వేగంగా ఉంది

-ఇక్కడే అవమానాలు ఎదుర్కొన్నాం..
-ఇప్పుడు అదే సభలో నేను మంత్రిని..
-ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు అనుసంధానకర్తను..
-హరీశ్‌రావు వ్యాఖ్యలు

Harish Rao (2)

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శానససభా వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేస్తుండటంతో ఉద్వేగానికి లోనవుతున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన చోట, ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండని అన్న సీమాంధ్ర నేతల అవహేళనలు, అవమానాలను భరించిన సభలోనే శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేయడం ఉద్వేగభరితంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్లతో తొలిబడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నదని మంత్రి చెప్పారు. మంగళవారం సచివాలయంలో హరీశ్‌రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణప్రాంత నేతలు సీమాంధ్ర నాయకుల డైరెక్షన్‌లోనే మాట్లాడేవారని, ఇప్పుడైనా దాని నుంచి బయటపడాలన్నారు.శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రిగా ప్రభుత్వానికి ప్రతిక్షాలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తానని చెప్పారు.

అవసరమైతే విపక్షపార్టీల కార్యాలయాలకు వెళ్లి సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా సహకరించాలని కోరుతానని తెలిపారు.ఏ అంశంపైనైనా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శాసనసభలో తాము ఎన్నుకున్న సభ్యులు ఏం చర్చిస్తారోనని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, అందుకు తగినవిధంగా సభను హుందాగా నిర్వహించుకుందామని ఆయన విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉన్నాయని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిలో ఆత్మైస్థెర్యం నింపాల్సిన బాధ్యత శాసనసభకు ఉందని అన్నారు. ప్రతిపక్షాలు ఆచరణాత్మకమైన సూచనలు చేస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హరీశ్‌రావు స్పష్టంచేశారు.

అన్ని అంశాలపై చర్చించేందుకు శాసనసభను ఉదయం, సాయంత్రం కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని, ఇందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలన్నారు. గతంలోప్రజా సమస్యలపై చర్చించమంటే సభను వాయిదా వేసుకొని వెళ్ళిపోయేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తదని చెప్పారు. ప్రతీ సభ్యునికి సభలో మాట్లాడే అవకాశం రావాలని అన్నారు. శాసనసభను ఎన్ని రోజులు, రోజుకు ఎన్ని గంటలపాటు నిర్వహించాలన్న విషయాన్ని బుధవారం బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని, శాసనమండలిలో కూడా చర్చలు సంపూర్ణంగా జరగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.