టీఆర్‌ఎస్ తొలి ఎన్నికల బహిరంగ సభ సక్సెస్

-ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చిన శ్రేణులు
-గులాబీమయమైన హయగ్రీవాచారి మైదానం
-డిప్యూటీ సీఎం కడియం సహా ఐదుగురు మంత్రులు హాజరు
-కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ విధానాలపై ఆగ్రహం
-పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
-సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి
-రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు పిలుపు

TRS-warangal-public-meeting

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్ నిర్వహించిన తొలి బహిరంగ సభ అదిరింది. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. సభ జరిగిన హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ టీఆర్‌ఎస్ జెండాలతో గులాబీమయమైంది. జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలందరూ ఉత్సాహంగా సభకు హాజరయ్యారు. ఉప ఎన్నికల కోసం అసెంబ్లీ స్థానాలకు నియమితులైన రాష్ట్ర మంత్రులు సైతం వచ్చారు. సభలో ప్రసంగించిన ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ మెజార్టీనే ప్రస్తావించారు. దయాకర్ గెలుపు ఖాయమైంది. బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన విజయం సాధించటమే మిగిలిందని అన్నారు.

ఉప ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయటం ద్వారా 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరికి లభించిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లతో దయాకర్‌ను పార్లమెంట్‌కు పంపాలని పార్టీ శ్రేణులకు పిలుపుఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతల ప్రసంగం సభకు వచ్చిన ప్రజలను ఆకట్టుకుంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి 21వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ను టీఆర్‌ఎస్ అధిష్ఠానం బరిలో నిలిపింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన దయాకర్‌ను అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయటం శ్రేణుల్లో ఆనందం నింపింది.

దయాకర్ అభ్యర్థిత్వం ఖరారుతో కేసీఆర్ సాధారణ కార్యకర్తను గుర్తించటమే కాకుండా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున రూ.70 లక్షల చెక్కును అతనికి అందజేయటం గులాబీలకు సంతోషాన్నిచ్చింది. అభ్యర్థి ఎంపిక జరిగిన తర్వాత వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడింటిలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో గత ఆదివారం టీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ నియోకజకవర్గాలకు ఉప ఎన్నికల సమన్వయ ప్రచార బాధ్యులుగా నియమితులైన రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో దయాకర్ భారీ మెజార్టీతో గెలిచేందుకు స్థానిక ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జితో కలిసి వ్యూహరచన చేశారు.

వరంగల్‌ తూర్పు శాసనసభ నియోజకవర్గం సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ సందర్భంగా టీఆర్‌ఎస్ బాలసముద్రంలోని హయగ్రీవచారిగ్రౌండ్‌లో మద్యాహ్నం బహిరంగ సభ నిర్వహించింది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ నిర్వహించిన తొలి బహిరంగ సభ ఇది. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు సభకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఆయా శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జి జనసమీకరణలో తమ పాత్ర పోషించారు.

సభకు హాజరైన ముఖ్యనేతలు…
టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పలువురు బహిరంగ సభకు హాజరు కావటం విశేషం. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అధ్యక్షతన సభ జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎ.చందూలాల్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, సీతరాంనాయక్, గుండు సుధారాణి, జడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు సభకు హాజరయ్యారు.

వీరితో పాటు టీఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.సుధాకర్‌రావు, పార్టీ అర్బన్ అధ్యక్షుడు ఎన్.నరేందర్, జిల్లాలోని ముఖ్య నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, మాలోత్ కవిత, రాజయ్యయాదవ్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, గుడిమల్ల రవికుమార్, యాదగిరి, రాజేంద్రకుమార్, సహోదర్‌రెడ్డి, వరదారెడ్డి, యాదవరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, ఎల్.కిషన్‌రావు, లలితయాదవ్, రాజలింగం సభలో పాల్గొన్నారు.