టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

-ఎమ్మెల్సీగా పల్లాను గెలిపించండి
-జై తెలంగాణ అననందుకే ఉత్తమ్‌కు పీసీసీ: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
-సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Palla Rajeshwar Reddy election campaign in Suryapet

తమది మాట మీద నిలబడే ప్రభుత్వమని, టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన పలు ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశాలలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 60 ఏండ్ల దోపిడీకి నిరసనగా ఉద్యమం చేస్తుంటే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఆంధ్రా నేతలకు మద్దతుగా నిలిచారని, అందుకే ఆయనకు పీసీసీ పదవి ఇచ్చారని ఆరోపించారు.

తెలంగాణలో శాంత్రిభద్రతలకు విఘాతం కలిగించి మళ్లీ ఏపీలో కలిపేందుకు చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడమే కాకుండా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన విద్యార్థులకు అండగా ఉన్న పల్లా రాజేశ్వరర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో గురువారం ఏర్పాటు చేసిన సభలో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో లేనివారు ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారని, వారిని చిత్తుగా ఓడించి బంగారు తెలంగాణ కోసం బాటలు వేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైలుకెళ్లానని, తనను ఎమ్మెల్సీగా గెలిపించి కేసీఆర్‌కు అండగా ఉండాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పూల రవీందర్, తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఆర్‌ఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాబాద్‌లో తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఏటూర్‌నాగారంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్, డోర్నకల్‌లో టీఆర్‌ఎస్, టీజీఏ, వడుప్సా సంయుక్తంగా ప్రచారం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్యవతిరాథోడ్ కోరారు. ఆత్మకూరు, గీసుగొండ మండలాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తిలో సుధాకర్‌రావు, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పర్యటించారు. ఖమ్మంలో రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ ప్రచారం చేశారు.