టీఆర్‌ఎస్ సభ్యులందరికీ 2 లక్షల ప్రమాద బీమా

-నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 4,64 కోట్లు చెల్లింపు
-ఈ-మెడ్‌లైఫ్ ప్రతినిధులకు చెక్కు అందించిన సీఎం కేసీఆర్
-ప్రతి సభ్యుడికీ 2లక్షల ప్రమాద బీమా

TRS-members 0001

కనీవినీ ఎరుగనిరీతిలో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసుకున్న టీఆర్‌ఎస్.. మరో కీలక అంకాన్ని ముగించుకుంది. పార్టీలో చేరిన ప్రతి సభ్యుడికీ ప్రమాద బీమా అమలుచేస్తామని ప్రకటించిన పార్టీ అధిష్ఠానం ఆ మేరకు ప్రక్రియ పూర్తిచేసింది. ఈ-మెడ్‌లైఫ్ అనే థర్డ్ పార్టీ కంపెనీద్వారా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమాను అమలు చేసేందుకు నిర్ణయించింది.

టీఆర్‌ఎస్ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై 50 లక్షలమంది పార్టీ సభ్యులుగా చేరారు. ఇందులో ఇప్పటివరకు 41.30 లక్షలమంది సభ్యులు తమ వివరాలను కార్యాలయానికి అందించడంతో వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. వీరందరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా అమలయ్యేలా శుక్రవారం పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు ఈ-మెడ్‌లైఫ్ ప్రతినిధులకు రూ.4,64,21,200 చెక్కును అందించారు. మిగిలిన సభ్యుల వివరాలనుకూడా త్వరగా సేకరించి.. వారికికూడా బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని పార్టీ నాయకులను ముఖ్యమంత్రి ఆదేశించారు. చెక్కు అందజేత కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.