టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేకే

-లోక్‌సభ పక్షనేత:జితేందర్‌రెడ్డి
-ఉపనేత:వినోద్
-విప్: కడియం శ్రీహరి

Keshava Rao

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావును టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు మంగళవారం నియమించారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేతగా జితేందర్‌రెడ్డిని, ఉపనేతగా వినోద్‌కుమార్‌ను, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విప్‌గా కడియం శ్రీహరిని నియమించారు. రాజ్యసభలో పార్టీకి ఒక్క సభ్యుడే ఉండటంతో కే కేశవరావు టీఆర్‌ఎస్ పక్షనేతగా ఉంటారు.

పోలవరంపై పార్లమెంట్‌లో పోరాడుతాం: జితేందర్‌రెడ్డి
పోలవరం ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో తీవ్రస్థాయిలో పోరాడుతామని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ఆర్డినెన్స్‌ను పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా ఆయన అభివర్ణించారు. లోక్‌సభ టీఆర్‌ఎస్‌పక్ష నేతగా తనను నియమించి అతిపెద్ద బాధ్యతను అప్పగించారని, పార్టీ అధినేత ఆశయాన్ని నెరవేరుస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ అయిన జితేందర్‌రెడ్డి అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా ఉండబోదని, చంద్రబాబుకు దీటుగా లాబీయింగ్ చేసి భారీఎత్తున నిధులు తెచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. త్వరలోనే మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తామన్నారు. తాను బీజేపీలో ఉన్న సమయంలో ఎంపీలుగా ఉన్నవారంతా నేడు కేంద్రమంత్రులయ్యారని, వారి సహకారంతో తెలంగాణకు నిధులు తీసుకొస్తామని చెప్పారు. సదానంద గౌడ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారని, కర్ణాటకకు కొత్త లైన్లు కావాలంటే తెలంగాణ మీది నుంచే వేయాల్సి వస్తుందని, ఇది కొత్త రాష్ర్టానికి కలిసొస్తుందన్నారు.