టీఆర్‌ఎస్‌కే ప్రజా దీవెన

-ఆకర్షణ కాదు.. పునరేకీకరణలో భాగమే ఈ చేరికలు
-తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లింది
-18 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం
-ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్
-టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిన మేడ్చల్ టీడీపీ నేతలు
-సాదరంగా ఆహ్వానించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

KTR-inviting-new-members-in-to-party-at-Medhchal-meeting

ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌కే ప్రజా దీవెన లభిస్తోందని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్‌లోని నవభారత్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత నందారెడ్డి, దేవరయాంజాల్ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్‌తో పాటు ఇతర నేతలు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 18 నెలల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. ఎవరినీ మభ్యపెట్టడం లేదని.. ఇంటి పార్టీగానే భావించి ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారన్నారు. మూకుమ్మడిగా మేడ్చల్ టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడం చారిత్రాత్మకమన్నారు. పార్టీలో చేరిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.