త్వరలోనే రైతులకు తీపీ కబురు

-అన్ని రుణాలూ మాఫీ
-మెదక్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
-భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

harish Rao

రుణమాఫీపై త్వరలోనే రైతులు తీపికబురు వింటారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అన్ని రకాల రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తెలంగాణవ్యాప్తంగా 35 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.18వేల కోట్ల రుణాలను మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మెదక్ జిల్లా అభివృద్ధిపై సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హరీశ్‌రావు చెప్పారు. రెండు,మూడునెలల్లో రుణమాఫీ అమల్లోకి వస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు తిరిగి రుణాలు అందించే విషయమై బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అవి తుది దశకు రానున్నాయన్నారు. పాత రుణాలు మాఫీ చేస్తూనే, కొత్త రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి వెల్లడించారు. మెదక్ జిల్లాను అన్ని రంగాలలలో సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి సారించిందని హరీశ్‌రావు తెలిపారు.

మెదక్ జిల్లా అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశమందిరంలో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో శాఖల వారీగా విస్తృతంగా చర్చించిన మంత్రి పథకాల అమలు, వాటిని లబ్దిదారులకు చేరవేసే విషయంపై పలు సలహాలు, సూచనలిచ్చారు. అలాగే అధికారులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమావేశానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబుమోహన్, రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, గీతారెడ్డి, కిష్టారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌లు హాజరయ్యారు.

జిల్లా అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజకీయాలకతీతంగా పరస్పర సహకారంతో ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటామని తీర్మానం చేశారు. అసెంబ్లీలో ప్రతిపాదించిన అభివృద్ధి అంశాలను జిల్లా అధికారులు అమల్లో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. రైతు రుణాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞత తీర్మానాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమావేశంలో ప్రవేశపెట్టగా, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ దాన్ని ఆమోదించినట్టు ప్రకటించడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలను జిల్లా యంత్రాంగం తరఫున ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ సన్మానించారు.