త్వరలో పాలమూరు ఎత్తిపోతల

రెండు, మూడు వారాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీఇచ్చారు. ఈ పథకం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు.

KCR-Visit-Mahabubnagar-district

 

ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని నాలుగు మురికివాడలను సందర్శించిన తర్వాత రాత్రి 8.30 గంటలకు జడ్పీ మైదానంలో సీఎం.. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాకు వచ్చి ఎంపీగా పోటీచేసిన నన్ను గెలిపించారు. ఇక్కడి ఎంపీగానే తెలంగాణను సాధించాను. చరిత్రలో ఆ కీర్తి పాలమూరుకే దక్కుతుంది అని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ వెనుబడిన జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీఇచ్చారు. ఇకపై జిల్లాలో పల్లేర్లు మొలిచే.. పాట వినబడకుండా చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ఎత్తిపోతల పనులను కూడా త్వరలో పూర్తిచేస్తానని హామీఇచ్చారు. జలహారం పనులను పూర్తిచేసి ఏడాదిలో మొదటగా మహబూబ్‌నగర్‌కే నీళ్లు అందిస్తామని చెప్పారు. వ్యవసాయం పెరుగాలని, రైతుల పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. ఆసరా, ఆహారభద్రత కార్డుల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చెప్పారు. పట్టణంలో 6535 ఇండ్లు నిర్మిస్తే ఇండ్లులేని పేదలే ఉండరని కేసీఆర్ అన్నారు. ముస్లింలకు బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1030 కోట్లతో ఇండ్లు నిర్మించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇక పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పెద్దరోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ. 70 కోట్లతో బైపాస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

పట్టణంలో ఒక్కో మార్కెట్‌కు కోటి రూపాయలు వెచ్చించి ఐదుచోట్ల పరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు, మాంసం మార్కెట్‌లు నిర్మిస్తామని, 8 రోజుల్లో శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. 15 రోజుల్లో పెద్దచెరువులో గుర్రపుడెక్కలు తొలగిస్తామని, చెరువు కట్టను విస్తరించి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడంతోపాటు సమీపంలోగల 35 ఎకరాలలో ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రులు లకా్ష్మరెడ్డి, జూపల్లి, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలరాజు, జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, నారాయణపేట ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-రెండు, మూడు వారాల్లో శంకుస్థాపన
-జలహారంతో మొదట పాలమూరుకే నీళ్లు
-డంపింగ్ యార్డు, ఐదుచోట్ల మార్కెట్లు
-మెడికల్ కళాశాల, కళాభారతి ఏర్పాటుకు పరిశీలన
-పాలమూరుపై సీఎం వరాల జల్లు
-వందశాతం మౌలిక వసతులు కల్పిస్తా
-అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
మహబూబ్‌నగర్ పట్టణంలో నూటికి నూరుశాతం మౌలిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా మంత్రులతో కలిసి పట్టణ అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ పట్టణ ప్రజల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో సరైన ప్రణాళికలు తయారుచేయాలని, అవసరమైన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఒకటి లేదా రెండు మల్టీలెవల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకొని నెలలోగా అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయాలని సూచించారు. పట్టణపరిధిలోని అప్పనపల్లి చెరువును మిషన్ కాకతీయ కింది అభివృద్ధి చేయాలని చెప్పారు. మెడికల్ కళాశాల, మహబూబ్‌నగర్ కళాభారతి వంటి సంస్థలను ఏర్పాటు చేయడానికి అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీదేవి, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, డీఆర్వో రాంకిషన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ సునందరాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, కమిషనర్ శ్రీనివాస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.