త్వరలో నిమ్స్ ప్రారంభం

-నియామకాలను పూర్తిచేస్తాం.. మెరుగైన
వైద్యం అందిస్తాం: డిప్యూటీ సీఎం రాజయ్య

Deputy CM Rajaiah 06

బీబీనగర్ నిమ్స్‌ను త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని డిప్యూటీ సీఎం రాజయ్య చెప్పారు. శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరి ఏరియా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారామెడికల్ సిబ్బంది, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగుల నియామకాలను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో వలసపాలకులు ప్రదర్శించిన వివక్ష కారణంగానే నిమ్స్ ప్రారంభం కాలేదన్నారు.

వైద్యారోగ్య శాఖను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా నియోజకవర్గ కేంద్రాల్లోని దవాఖానలను సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తామని పునరుద్ఘాటించారు. అన్ని దవాఖానల్లో వసతులు కల్పిస్తామని, వైద్యుల పనివిధానాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. వైద్యులు దేవుడితో సమానమని, కానీ సేవల్లో వైఫల్యం స్పష్టమైతే ప్రజలు దయ్యాలుగా చూస్తారనే విషయాన్ని మరిచపోవద్దన్నారు. మన ఊరు-మన దవాఖాన అనే పట్టుదలతో వనరులను సమకూర్చుతామని తెలిపారు.

త్వరలో జరగనున్న మెడికల్ కౌన్సెలింగ్ కోసం నిబంధనలను రూపొందిస్తున్నామని, ౧౦ శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా, ౪౦ శాతం మేనేజ్‌మెంట్ కోటా విషయంలో నిబంధనలు ఖరారుచేస్తామని చెప్పారు. అంతకు ముందు దవాఖానను పరిశీలించి నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా పనివిధానంలో మార్పురావాలని హెచ్చరించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులున్నారు.

Deputy CM Rajaiah

దసరా నుంచి పెంచిన పింఛన్ల పంపిణీ :
దసరా పండుగ నుంచి పెంచిన వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ట్రామాకేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ప్రతిహామీని నెరవేర్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.